ఎల్బీనగర్:
దేవాలయ అభివృద్ధికి దాతలు ఇచ్చిన విరాళాలు దేవాలయ ధర్మకర్తలు తమ జేబులో వేసుకొని స్వంత ఖర్చులకు వినియోగించుకుంటున్నారని కర్మన్ ఘాట్‌లోని పవిత్ర ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆలయ అభివృద్ధి కోసం భక్తులు సమర్పించిన విరాళాలను కొంతమంది ధర్మకర్తలు అభివృద్ధి పనులకు వినియోగించకుండా, తమ స్వంత అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి.ఈ విషయంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా, కొంతమంది ధర్మకర్తలు ఆలయ సిబ్బందిపై ఆజమాయిషీ చలాయిస్తూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఇద్దరు ధర్మకర్తలు ఆలయంలో పార్కింగ్ నిర్వహణ, కొబ్బరి చిప్పల సేకరణ వంటి వ్యవహారాల్లో కూడా బెదిరించి లంచాలు తిన్నట్లు, డైరీలు ప్రింట్ చేయిస్తామని అర్చకులపై ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.ఈ పరిణామాలు ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా, ఈ విషయంపై ఫిర్యాదు ఇచ్చిన సదరు స్వామి భక్తులు ఫిర్యాదుపై స్పందించిన ఆలయ ఈఓ లావణ్య, ఈ అంశం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు.


