మద్యానికి బానిసై వృద్ధ తల్లిదండ్రులను చంపిన కొడుకు..
రాళ్లు పగులగొట్టే పెద్ద సుత్తితో కొట్టి చంపిన వైనం..
వారి మృతదేహాల వద్దనే రాత్రంతా కూర్చొన్న కిరాతకుడు..
ఒక వ్యక్తి సుత్తితో కొట్టి తన పేరెంట్స్ ను హత్య చేశాడు. అనంతరం రక్తం మడుగుల్లో పడి ఉన్న వారి మృతదేహాల వద్ద రాత్రంతా గడిపాడు. ఉదయం స్థానికులు అది చూసి షాక్ అయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ధోనాపాల్ గ్రామానికి చెందిన హిమాన్షు (55) ఆటో డ్రైవర్. అతడు మద్యానికి బానిసై ఇంట్లో గొడవపడటంతో భార్య, పిల్లలు చాలా కాలంగా విడిగా ఉంటున్నారు. కాగా, మంగళవారం రాత్రి హిమాన్షు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. వృద్ధ తల్లిదండ్రులైన హదిబంధు సాహు (81), శాంతి సాహు (72)తో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో రాళ్లు పగులగొట్టే పెద్ద సుత్తితో వారిని కొట్టాడు. దీంతో తల్లిదండ్రులు చనిపోయారు. రక్తపు మడుగులో వారి మృతదేహాల వద్దనే రాత్రంతా అతడు కూర్చొన్నాడు.
ఈ రోజు ఉదయం స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హిమాన్షును అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం బరిపాడలోని పీఆర్‌ఎం మెడికల్ కాలేజీకి తరలించారు.