గచ్చబౌలి ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పరిశీలన
78 ఫిర్యాదులను పరిష్కరించిన హైడ్రా
మల్కం చెరువు పరిసరాల్లో వరద పోటెత్తడానికి గల కారణాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ఉదయం సమీక్షించారు. వరద ముంచెత్తడానికి, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడడానికి కారణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. చెరువుకు వచ్చే వరద పెద్దమొత్తంలో ఉండి.. బయటకు వెళ్లేది ఆ స్థాయిలో లేకపోవడంతో సమస్య తలెత్తిందని అదికారులు తెలిపారు. ప్రస్తుతం అలుగు పారడం ద్వారా మాత్రమే నీరు బయటకు వెళ్తోందని.. స్లూయిజ్ గేట్లు కూడా ఏర్పాటు చేస్తే.. వర్షాకాలంలో నీటిమట్టాన్ని తగ్గించడానికి వీలౌతోందని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పుడు వెంటనే ఈ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. చెరువు పరిసరాల్లో రహదారులే కాకుండా.. నివాసాలు కూడా నీట మునుగుతున్నాయని.. వెంటనే ఈ పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. చెరువులోకి వచ్చిన ఇన్లెట్ల సామర్థ్యంతో పాటు.. ఔట్‌లెట్‌ను కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. మల్కం చెరువు చుట్టూ వరద నిలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. బయోడైవర్సిటీ పార్కు పరిసారలతో పాటు.. షేక్‌పేట ప్రాంతాల నుంచి కూడా భారీ వరద వచ్చి వంతెన ఆరంభంలో నిలిచిపోతోందని.. ఈ వరదంతా మల్కం చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలన్నారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తదితరులు కమిషనర్‌తో పాటు క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉన్నారు.
గురువారం అర్ధరాత్రి వరకూ :
గురువారం సాయంత్రం 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలి పరిసరాలు గురువారం రాత్రి నీట మునిగాయి. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వెళ్లే రహదారి షేక్ పేట వంతెన ఆరంభంలో నడుము లోతు నీళ్లు నిలిచిపోయాయి. అలాగే ఉస్మానియా కాలనీలోని కొన్ని ప్రాంతాల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. హైడ్రా కమిషనర్ హుటాహుటిన అక్కడకు చేరుకుని వరద నీటిని తొలగించే పనులను పర్యవేక్షించారు. తొలుత ఉస్మానియా కాలనీలో వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్.. మల్కం చెరువు పరిసరాలను పరిశీలించారు. వరద తొలగించే పనులను పర్యవేక్షిస్తూనే.. ట్రాఫిక్ క్లియరెన్స్‌పై దృష్టి పెట్టారు. వరద ముప్పు లేని ప్రాంతాల నుంచి కూడా హైడ్రా డీఆర్ ఎఫ్, ఎంఈటీ బృందాలు అక్కడికి చేరుకుని వాహన రాకపోకలు సులభం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ ఎంసీ సిబ్బందితో పాటు.. అర్ధరాత్రి 12.30 గంటల వరకూ అక్కడే ఉండి.. వరదతోపాటు.. ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చూశారు. యిలా మొత్తం 78 ఫిర్యాదులను రాత్రికి రాత్రే హైడ్రా పరిష్కరించింది. 41 చోట్ల పడిపోయిన చెట్లను పక్కకు తొలించారు. 36 చోట్ల వరద నీరు నిలిచిపోగా హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ , మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు సమస్యను పరిష్కరించాయి. బంజారాహిల్స్ లోని ఎస్.బీ.ఐ. ఎగ్జిక్యూటివ్ ఎంక్లెవ్, గ్రీన్ వ్యాలీ సమీపంలో వరదలో చిక్కుకున్న మహిళను కాపాడారు.


