Saturday, March 14, 2026
Google search engine
Homeఆంధ్రప్రదేశ్రాజమహేంద్రవరం శివారులో పెద్దపులి సంచారం… గ్రామాల్లో భయాందోళన

రాజమహేంద్రవరం శివారులో పెద్దపులి సంచారం… గ్రామాల్లో భయాందోళన

15 రోజుల్లో దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు అంచనా

రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం నగర శివారు గ్రామాల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతోంది. మంగళవారం రాత్రి నగర శివారులోని దివాన్‌చెరువుకు చేరుకున్న పెద్దపులి, అక్కడి నుంచి బీజాపూర్‌ టౌన్‌షిప్‌, శ్రీరాంపురం మీదుగా రఘునాథపురం వరకు సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఓ గేదెను పులి చంపిన ఆనవాళ్లు లభించాయి.

బుధవారం ఉదయం రాజమహేంద్రవరం గ్రామీణ మండలం అంకాలమ్మతల్లి కొండ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కొండకు అవతల వైపు గుబురుగా ఉన్న జీడిమామిడి తోటలో పులి సేదతీరుతూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో అప్రమత్తత ప్రకటించారు.

భారీగా అటవీ బృందాలు… ట్రాంక్విలైజర్ సిద్ధం

పెద్దపులిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చినట్లు స్టేట్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ (పీసీసీఎఫ్‌) పి.వి. చలపతిరావు తెలిపారు. పులికి మత్తు ఇచ్చేందుకు ట్రాంక్విలైజర్‌, బోను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

పుణె, ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలు రాజమహేంద్రవరం చేరుకుంటున్నాయని, ప్రస్తుతం 12 అటవీ బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. డ్రోన్‌లు, నైట్ విజన్ కెమెరాల ద్వారా పులి కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం.

15 రోజుల్లో 600 కిలోమీటర్లు ప్రయాణం?

సీసీఎఫ్‌ మూర్తి మాట్లాడుతూ, పెద్దపులి గత 15 రోజుల్లో దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. అడవులు తగ్గిపోవడం, ఆహారం కోసం వెతుక్కుంటూ పులి జనావాసాల వైపు రావడం దీనికి కారణంగా ఉండొచ్చని తెలిపారు.

ప్రజలకు హెచ్చరిక

పులి సంచారం నేపథ్యంలో ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పశువులను బయట కట్టివేయొద్దని అటవీశాఖ సూచించింది. ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే అటవీశాఖ లేదా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.

పులిని సురక్షితంగా పట్టుకునే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని, ప్రజలు సహకరించాలని అటవీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments