సంచలన ప్రకటన చేసిన హీరో మాధవన్..
‘ఆప్ జైసా కోయి’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో వచ్చిన ఆర్. మాధవన్
రొమాంటిక్ సినిమాల్లో నటించగలననే భావనలో ఉన్నానన్న మాధవన్
ఇక నుండి వయస్సుకు తగిన సినిమాలనే ఎంచుకుంటానని వెల్లడి
సినీ నటుడు ఆర్. మాధవన్ ఇకపై రొమాంటిక్ చిత్రాల్లో నటించబోనని స్పష్టం చేశారు. ఆయన ఇటీవల ‘ఆప్ జైసా కోయి’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఫాతిమా సనా షేక్‌తో కలిసి ఆయన నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో 55 ఏళ్ల మాధవన్ తనకంటే చాలా తక్కువ వయస్సు గల నటితో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా ప్రారంభించినప్పుడు తాను ఇంకా రొమాంటిక్ చిత్రాల్లో నటించగలననే భావనలో ఉన్నానని, అందుకే ఈ వయస్సులో కూడా అంగీకరించానని మాధవన్ అన్నారు. అయితే ఇకనుండి తన వయస్సుకు తగిన చిత్రాలనే ఎంచుకోవాలని భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఇక నుంచి రొమాంటిక్ చిత్రాలను పూర్తిగా వదిలేస్తానేమోనని, చివరి అవకాశంగా ఇలాంటి చిత్రంలో నటించానని ఆర్. మాధవన్ అన్నారు. సినిమా పరిశ్రమలో రొమాటింక్ హీరోల్లో మాధవన్ ఒకరు. ‘ఆప్ జైసా కోయి’ చిత్రం జులై 11న నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది.