తెలంగాణ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో బుర్రకథ కళాకారులతో ప్రదర్శన
ఎల్బీనగర్:
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా మెలిగినప్పుడే ఆర్థిక మోసాలకు గురికాకుండా తమ కష్టార్జిత ధనాన్ని కాపాడుకోగలుగుతారని నాగోల్ పోలీస్ స్టేషన్ సిఐ మహమ్మద్ మక్బూల్ జానీ స్పష్టం చేశారు.సోమవారం నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో గల తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై బుర్ర కథ కళాకారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐ మహమ్మద్ మక్బూల్ జానీ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, సైబర్ మోసాల పద్ధతులు కూడా విస్తరిస్తున్నాయని తెలిపారు.
ఫోన్ కాల్స్, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, ఓటీపీలు, ఫేక్ లింకులు, యూపీఐ రిక్వెస్ట్‌లు, సోషల్ మీడియా మోసాల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు. ఎవరితోనూ ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్లు వంటి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు పంచుకోకూడదని సూచించారు.అనుమానాస్పద మెసేజ్‌లు, లింకులు, రివార్డు ఆఫర్లు, లోన్ ఆఫర్లు వంటి వాటిని నమ్మవద్దని, ఎటువంటి లావాదేవీ చేయడానికి ముందు ధృవీకరించుకోవాలని తెలిపారు. మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తక్షణ చర్యల ద్వారా డబ్బు రికవరీకి అవకాశం ఉంటుందని వివరించారు.ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులకు ఆర్థిక సాక్షరతపై కూడా అవగాహన కల్పించారు. సురక్షితమైన డిజిటల్ లావాదేవీలు, యూపీఐ వినియోగం, పాస్‌వర్డ్ భద్రత, సోషల్ మీడియా జాగ్రత్తలు వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు.సమాజంలో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సు ప్రజలకు ఉపయోగకరంగా నిలిచింది. డిజిటల్ యుగంలో జాగ్రత్తే రక్షణ అన్న సందేశం ఖాతాదారులకు ఉపయోగపడింది.ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రాజలక్ష్మి, సిబ్బంది మమత, శశిధర్, ఫణి కుమార్, శోభ బ్యాంకు ఖాతాదారులు, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


