పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే నీకే నష్టం..
అధ్యాపకులను వేధిస్తున్నారంటూ దగ్గుపాటిపై ఫిర్యాదులు..
ఏడుగురు ఎమ్మెల్యేల ప్రవర్తనపై అధిష్ఠానం ఆందోళన
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస వివాదాలపై వివరణ కోరిన సీఎం, ఆయన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు.
అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వేధింపులకు గురిచేస్తున్నారంటూ కొందరు అధ్యాపకులు ఇటీవల ముఖ్యమంత్రికి నేరుగా ఫిర్యాదు చేశారు. దానికి తోడు ఇటీవలి వివాదంఎన్టీఆర్ పై వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించిన చంద్రబాబు, తక్షణమే వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యేను ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి ఒకసారి సీఎంను కలిసిన దగ్గుపాటి, గురువారం మరోసారి ముఖ్యమంత్రిని కలిసి తన వాదన వినిపించారు. అయితే, ఆయన వివరణతో సంతృప్తి చెందని సీఎం, ప్రజల సమస్యలు పరిష్కరించాలే తప్ప, వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని స్పష్టం చేశారు. తన దృష్టికి ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని, ఇదే తీరు కొనసాగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.