ఉప్పాడను చాలాకాలంగా వేధిస్తున్న తీర ప్రాంత కోత సమస్య..
రూ.323 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు..
ఎన్డీయే ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ద్వారా ఉప్పాడలో తీర రక్షణ నిర్మాణాలను అభివృద్ధి చేసే ప్రతిపాదనను సుమారు రూ.323 కోట్ల అంచనా వ్యయంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని తెలిపారు.
“గత ఐదేళ్లలో సగటున ఏటా 1.23 మీటర్ల తీరం కోతకు గురైంది, దీంతో సుమారు 12 మీటర్ల తీరం కోల్పోయింది. ఇది సమీప గ్రామాలపై, ముఖ్యంగా మత్స్యకారుల గృహాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎన్‌డీఏ ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి, అవసరమైన అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
“ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌డీఎంఏ ద్వారా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలను సమర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తారని, హోం మంత్రి అమిత్ షా కాకినాడ ప్రజల ఆకాంక్షలను గుర్తిస్తారని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉదారంగా సహకరిస్తున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు ఆమోదం పొంది, బాధితులకు వారు ఎప్పటి నుంచో కోరుకున్న ఊరట లభిస్తుందని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో ఆశాభావం వ్యక్తం చేశారు.