బాగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..
ధరలు ఐదు వారాల గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి..
బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1400 తగ్గి తులం రూ.99,620 చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి రూ.1200 తగ్గి తులం రూ.99,250 తగ్గింది. ఇక వెండి ధర రూ.3వేలు తగ్గి కిలోకు రూ.1.15లక్షలకు దిగివచ్చిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. జపాన్, ఫిలిఫ్పీన్స్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం ప్రకటించిన నేపథ్యంలో రిస్క్ ప్రీమియం తగ్గడంతో లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం ధరలు పతనమయ్యాయి. ముఖ్యంగా చైనా, యూరప్ లాంటి దేశాలు ఒప్పందం చేసుకోనున్నాయన్న వార్తల మధ్య అంచనాలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం 24.35 0.72 తగ్గి ఔన్సుకు 3,362.88 డాలర్లకు చేరింది. అదే సమయంలో స్పాట్ సిల్వర్ 0.53 శాతం తగ్గి ఔన్సుకు 39.05కి చేరుకుంది.
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ బంగారం ఐదు వారాల గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉందని తెలిపారు. గురువారం కూడా ధర తగ్గిందని చెప్పారు. యూఎస్, ప్రధాన వాణిజ్య భాగస్వాముల మధ్య ఒప్పందాలపై ఆశాభావం నేపథ్యంలో బంగారానికి డిమాండ్ తగ్గిందన్నారు. అయితే, ధరలు తగ్గడం స్వల్ప కాలమే ఉంటుందన్నారు. గత నెలలో బంగారం స్థిరంగా పెరుగుతూ వచ్చిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) జతిన్ త్రివేది పేర్కొన్నారు. కొత్త ఒప్పందాల ప్రకటనలు ఉద్రిక్తతలను తగ్గించే ఆశలు పెంచాయని.. దాంతో స్వల్పకాలికంగా బంగారం డిమాండ్ తగ్గిందన్నారు. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం కోసం పెట్టుబడిదారులు నిరీక్షిస్తున్నారని తెలిపారు.