పేదరికంపై ప్రజా భాగస్వామ్యంతో పోరాటమని స్పష్టం చేసిన సీఎం
కుప్పంలో 250 పేద కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకున్న చంద్రబాబు
“నేను కూడా ఒక మార్గదర్శినే. మాటలు చెప్పడమే కాదు, చేతల్లో చూపిస్తాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 250 పేద కుటుంబాల బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, దత్తత తీసుకున్న ఆ కుటుంబాల బాగోగుల కోసం కచ్చితంగా సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన ‘పీ4’ (ప్రజలు-ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన) కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “పేదలకు సేవ చేసినప్పుడు కలిగే సంతృప్తి మరెందులోనూ రాదు. సమాజం ఇచ్చిన సహకారంతో పైకి వచ్చిన వారు, తిరిగి సమాజానికి సేవ చేయాలి. మార్గదర్శులు కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, బంగారు కుటుంబాలకు అండగా నిలిచి భరోసా ఇవ్వాలి” అని పిలుపునిచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని తాము బలంగా నమ్ముతామని, కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పేదల కోసమే ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,41,977 మంది మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 13,40,697 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ సహకారంతో రాష్ట్రంలో ‘సంజీవని’ పేరుతో ఒక బృహత్తర ఆరోగ్య పథకాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. “ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఇప్పటికే కుప్పంలో గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి డీజీ నెర్వ్ సెంటర్ ఏర్పాటు చేశాం. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాకు, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఈ నెలలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని, పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేశామని సీఎం గుర్తుచేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని, విజన్ 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, ఎన్నార్టీ చైర్మన్ వేమూరి రవికుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సౌదీ అరేబియాలో ఉన్న ఎన్నారైలు కూడా జూమ్ ద్వారా పాల్గొని పలు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు.