జూలై నుంచి ఆగష్టు 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో పంపిణీ..
వివరాలు వెల్లడించిన కప్పాటి పాండురంగా రెడ్డి..
గురువారం నాడు ఒక ప్రకటనలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల జూలై 25 నుంచి ఆగస్టు 10 వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరగనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తోన్న వారికి, ఇటీవల తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంబించిన అనంతరం 7లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టుగా ప్రకటించారన్న విషయ తెలిసిందేనని.. చాలా ఏళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తుండటంతో దీనిపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కొత్త రేషన్‌కార్డుల మంజూరుతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులనూ జోడించారు. అటు కొత్త కార్డులు, ఇటు పాత కార్డుల్లో జోడింపుతో పేద కుటుంబాల సభ్యులు భారీ సంఖ్యలో రేషన్ పథకంలో లబ్ధిదారులవుతారని, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని పాండురంగా రెడ్డి అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన పేద కుటుంబాలు ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలవుతున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కు వంట గ్యాస్ సిలిండర్ వర్తింపు వంటి అనేక సంక్షేమ పథకాలలో లబ్ధి చేకూరనుంది అని పాండురంగా రెడ్డి అన్నారు.