ఆదిభట్లలో వెలుగు చూసిన మూఢభక్తి ప్రసహనం..
ఇంటి ముందు ఉన్న 20 ఏళ్లనాటి వృక్షాలు ధ్వంసం..
మున్సిపల్ అనుమతులు లేవు, ఎలాంటి సమాచారం లేదు..
ఇంటినుంచి రాకపోకలు సాగిస్తే దౌర్జన్యకాండ కొనసాగింపు..
ఏకంగా ఒక కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న దౌర్భాగ్యం..
ఏ దేవుడు చెప్పాడు ఇలా చెయ్యమని అంటూ వాపోతున్న బాధితులు..
ఆధిభట్ల మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన జోగు స్వామి..
తనకు న్యాయం చేసి, ఇంటిముందు అక్రమ కట్టడాలను తొలగించాలని విన్నపం..
మనసా వాచా తనను పూజిస్తే చాలు అని భగవంతుడు కోరుకుంటాడు.. కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో పేరుకుపోయిన హంగామా భక్తిని ఉన్మాదంగా మార్చివేస్తోంది.. గణేష్ ఉత్సవాలకు నగరం ముస్తాబవుతున్న వేల ఎక్కడచూసినా రోడ్లమీద గణేష్ మండపాలు ఏర్పాటుచేసి జనజీవనానికి విఘాతం కలిగిస్తున్నారు కొందరు మూర్ఖులు.. పాద చారులకు, వాహనదారులకు అంతులేని ఆటంకాలు సృష్టిస్తున్నారు.. ఏమైనా అంటే గణేశుని పేరు చెప్పి బెదిరింపు పర్వాలకు దిగుతుతున్నారు.. ఇలాంటి సంఘటనే ఆదిభట్ల మున్సిపాలిటీ చంతపల్లి గూడ గ్రామంలో చోటు చేసుకుంది.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం..
జోగు స్వామి తండ్రి రాములు, చింతపల్లి గూడ గ్రామం, ఆదిభట్ల మున్సిపాలిటీ నివాసి.. ఈయనకు ఆయన నాన్న, తాత, ముత్తాతలు నివసించినటువంటి సొంత ఇల్లు వుంది.. ఆ ఇంటి ముందు అతని తండ్రి గారు దాదాపు 20 ఏళ్ల క్రితం నాటిన వృక్షాలు ఉన్నాయి అందులో పెద్ద పెద్ద వేప చెట్లు, మామిడి చెట్లు, వగైరా కూడా ఉన్నాయి.. ఇలాంటి మహా వృక్షాలను కొంతమంది రౌడీ మూకలు దౌర్జన్యంగా వచ్చి వాటిని టార్గెట్ గా చేసుకుని మునిసిపల్ ఆఫీస్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. మున్సిపాలిటీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొట్టివేయడం జరిగింది.
03-08-2025 రోజు తన ఇంటి ముందు అక్రమ కట్టడాలు కట్టడం కోసమని ఆయన కుటుంబ సభ్యులను ఇంట్లోకి పోనివ్వకుండా, బయటకు రానీయకుండా పూర్తిగా రాకపోకలు బంద్ చేస్తూ ఆ కుటుంబానికి జీవించే హక్కును హరిస్తూ.. ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ.. వారి ఇంటి పైకి దాడికి వస్తూ.. వారు ఇంట్లోకి పోయే దారిని మూసి వేసి.. ఆటంకం కలిగిస్తున్నారని బాధితుడు జోగు స్వామి వాపోయాడు.. గణేష్ మండపం నిర్మాణం కోసం వారి ఇంటి ముందు అక్రమ నిర్మాణం చేపట్టడం కోసమని మంగళవారం నాడు ముగ్గు పోయడం జరిగింది. ఈ విషయం గమనించి తనకు న్యాయం చేయాలని, తమ జీవితాలకు స్వేచ్ఛ కలిగించాలని కోరుతూ ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తూ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఆ వినతి పత్రంలో జరుగుతున్న దౌర్జన్యకాండను విశదీకరించడం జరిగింది.. కావున మున్సిపల్ కమిషనర్ గారు ఇట్టి విషయమై అక్రమంగా నిర్మాణం చేపడుతున్నటువంటి వ్యక్తుల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకొని తన ఇంటి ముందు ఇలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోగలరని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వేడుకోవడం జరిగింది..
మరి ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.. దేవుని పేరు చెప్పి దౌర్జన్యాలు చేస్తున్న ఇలాంటి దుండగులను కట్టింది చేయవలసిన అవసరం కూడా ఉందని స్థానికులు అంటున్నారు..