భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్టు..
నేడు రెండో రోజు ఆట..
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 358 ఆలౌట్
ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఓల్ట్ ట్రాఫర్డ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో నేడు రెండో రోజు ఆటలో టీమిండియా ఎక్కువసేపు నిలవలేకపోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లతో రాణించగా, ఆర్చర్ 3 వికెట్లు తీశాడు.
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్ కు దిగి అర్థ సెంచరీ సాధించడం ఇవాళ్టి ఆటలో హైలైట్. పంత్ 75 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో 54 పరుగులు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే… ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46 పరుగులతో నిలకడ చూపగా… యువ ఆటగాడు సాయి సుదర్శన్ 61 పరుగులతో సత్తా నిరూపించుకున్నాడు.
కెప్టెన్ శుభ్ మన్ గిల్ (12) విఫలమయ్యాడు. జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ (27) తలోచేయి వేయడంతో టీమిండియా స్కోరు 300 మార్కు దాటింది.
అనంతరం, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ ఒక్కడే 24 పరుగులు చేయడం విశేషం. మరో ఎండ్ లో జాక్ క్రాలే (0 బ్యాటింగ్) ఇంకా ఖాతా ఆరంభించలేదు.