మల్లంపేట ప్రజల పోరాటం.. ప్రణీత్ ఆంటిల్యా ఆరాటం..
గేటెడ్ కమ్యూనిటీ అంటూ అడ్డుకుంటున్నారు..
సమస్యను పరిశీయించిన హైడ్రా..
దారికి అడ్డంగా కట్టిన గోడ వేలాది ప్రజలకు గోసగా మారింది. ఆఖరుకు అది పోరాటంగా మారింది. ఔటర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 4 నుంచి మల్లంపేట, బాచుపల్లి క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రగతినగర్‌కు సులభంగా చేరుకునే మార్గం దొరకక అవస్థలు పడినవారు కొంతమంది అయితే.. మాది గేటెడ్ కమ్యూనిటీ మా కాలనీలోంచి రాకపోకలు బంద్.. అంటూ అడ్డు గోడలు కడుతున్నవారు మరి కొంతమంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలంలోని మల్లంపేట, బాచుపల్లి గ్రామాల మధ్య నెలకొన్న వివాదం ఇది.
గోడ తీస్తే.. గోస పోద్ది :
మల్లంపేట ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్ నుంచి బాచుపల్లి క్రాస్ రోడ్స్ మీదుగా ప్రగతినగర్ కు కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే సరిపోతోంది. కాని దారి మధ్యలో ప్రణీత్ ఆంటిల్యా వారు నిర్మించిన అడ్డుగోడతో 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని మల్లంపేట గ్రామ ప్రజలతో పాటు.. మరో 10 కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రణీత్ ఆంటిల్యా వారు అడ్డుగోడ తీసేస్తే 60 నుంచి 40 ఫీట్ల వెడల్పుతో ఉన్న అడ్డ దారి దొరుకుతుందంటున్నారు. వాస్తవానికి గేటెడ్ కమ్యూనిటీ కాదు.. అయినా గోడ కట్టి మాది గేటెడ్ కమ్యూనిటీ అంటూ రాకపోకలను అడ్డుకుంటున్నారని మల్లంపేట వాసులు వాపోతున్నారు. మల్లంపేట ఎగ్జిట్ నుంచి మల్లంపేట విలేజ్, ప్రణీత్ లీఫ్‌కాలనీ, ఆకాష్ వెంచర్, డ్రీం వ్యాలీ కాలనీ, గ్రీన్‌పార్కు కాలనీ, సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ, ఏపీఆర్ కాలనీ, ఇందిరమ్మకాలనీ, లక్ష్మి శ్రీనివాస్ కాలనీ, హెచ్ ఎండీఏ, ప్రణీత్ ఆంటిల్యా, బాచుపల్లి చౌరస్తా మీదుగా ప్రగతినగర్‌కు కేవలం 3 కిలోమీటర్ల రాజమార్గంలో రాడానికి అవకాశం ఉన్నా అడ్డుగోడలు పెట్టారని .. దీంతో 25 వేల మందికి పైగా అవస్థలు పడుతున్నామని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రణీత్ ఆంటిల్యా నివాసాల మధ్య నుంచి బళ్లబాట ఉండేదని కూడా మల్లంపేటతో పాటు పరిసర నివాస ప్రాంతాలవారు చెబుతున్నారు. కాని.. ప్రణీత్ ఆంటిల్యా వాదన మరోలా ఉంది.. ఆ గోడ తీస్తే మాకు గోస మొదలౌద్ది. మొత్తం ఈ కాలనీలు, బస్తీల నుంచి వచ్చే వాహనాలు మా కాలనీమీదుగా రాకపోకలు సాగిస్తే చాలా ఇబ్బందిగా పరిణమిస్తుందని ప్రణీత్ ఆంటిల్యా వాసులు వాపోతున్నారు.

హైడ్రా పరిశీలించి చర్యలు :
మల్లంపేట ప్రజల ఫిర్యాదుపై హైడ్రా లోతైన పరిశీలన చేసింది. హెచ్ ఎం డీఏ అనుమతులను పరిశీలించింది. ప్రణీత్ ఆంటిల్యా గేటెడ్ కమ్యూనిటీ కాదని హెచ్ ఎం డీఏ అనుమతిచ్చిన లే ఔట్ స్పష్టం చేస్తోంది. హెచ్ ఎండీఏ అనుమతుల్లో 7వ అంశాన్ని పరిశీలిస్తే గేటెడ్ కమ్యూనిటీ కాదని.. నివాస ప్రాంతాలకు చుట్టూ ప్రహరీ నిర్మించరాదని.. మరీ ముఖ్యంగా రహదారులకు అడ్డంగా గోడలు నిర్మించరాదని.. పక్కన ఉన్న కాలనీవాసులకు దారి చూపాలని ఎంతో స్పష్టంగా పేర్కొంది. ఆ క్రమంలోనే అక్కడి ప్రహరీలను హైడ్రా ఇటీవల తొలగించింది. తర్వాత ప్రణీత్ ఆంటిల్యా కాలనీ వాసుల నుంచి అభ్యంతరాలు రావడంతో మరింత లోతుగా అధ్యయనం చేసింది. ప్రణీత్ ఆంటిల్యా నివాసాల మధ్య నుంచే గతంలో బళ్లదారి ఉండేదని రెవెన్యూ అధికారులుచెబుతున్నారు. నిజాంపేట మున్సిపల్ అధికారులు ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదని నిర్ధారించారు. దీంతో ఇరుపక్షాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మున్సిపల్, రెవెన్యూ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు పక్షాల సమక్షంలోనే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు.. దారి ఇవ్వాల్సి ఉంటుందని సమావేశం నిర్ణయించింది.