హైడ్రాను కోరిన జైళ్ల విభాగం డైరెక్టర్ జనరల్..
హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ను కలిసిన సౌమ్య మిశ్రా..

చర్లపల్లి జైలు ప్రాంతంలో ఉన్న 58 ఎకరాల చెరువును ఆధునికీకరించడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దడంలో హైడ్రా సహకారం కావాలని జైళ్లు విభాగం డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా కోరారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని హైడ్రా కార్యాలయంలో కలిసి చర్లపల్లి జైలు ప్రాంతంలో ఉన్న చెరువు వీడియోలను చూపించారు. నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేస్తున్న హైడ్రాను అభినందించి.. చర్లపల్లి ప్రాంతంలో ఉన్న 58 ఎకరాల చర్లపల్లి చెరువును కూడా అభివృద్ధి చేయడంలో హైడ్రా పూర్తి సహకారం అందించాలని కోరారు. హకీంపేట నుంచి ఆరేడు గొలుసుకట్టు చెరువులతో అనుసంధానమైన ఈ చెరువుకు.. మురుగు నీరు కలవకుండా డైవర్ట్ నాలా ఉందని హైడ్రా ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు. చెరువు చుట్టూ దాదాపు 3 కిలోమీటర్ల మేర నడక దారి అందుబాటులోకి వస్తుందని అన్నారు. చుట్టూ పాత్‌వే, మినీ పార్కులు, చెట్లు, సీటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు.. సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేస్తే అందరికీ వినియోగంలోకి వస్తుందన్నారు.
చర్లపల్లి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు సామాజిక బాధ్యత కింద నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని సౌమ్య మిశ్రా చెప్పారు. అప్పటికప్పుడే చెరువు అభివృద్ధి బాధ్యతలను హైడ్రా అధికారులకు కమిషనర్ అప్పగించారు. చెరువును త్వరలోనే సందర్శిస్తామని హామీ ఇచ్చారు. నగరంలో మొదటి విడతగా చేపట్టిన 6 చెరువుల అభివృద్ధికి సంబంధించిన వీడియోలను హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా ప్రదర్శించారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూముల పరిరక్షణకు హైడ్రా చేస్తున్న కృషిని సౌమ్య మిశ్రా అభినందించారు. హైడ్రాతో పాటు.. జైళ్ల విభాగం అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


