ఎస్పీలకు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలి..
ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి..
ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం, పస్రా తాడువాయి మధ్యలో ఉన్న జలగలంచ గుండ్ల వాగుల ద్వారా వచ్చే వరద ఉధృతిని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ పరిశీలించి ములుగు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
గ్రామ కార్యదర్శులు తమ తమ గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా వర్షాలు కురుస్తున్నాయని,అదే విధంగా ములుగు జిల్లాలో భారీ వర్షాలు నిన్నటి నుండి కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మంత్రి ప్రజలకు సూచించారు. జిల్లా అధికార యంత్రాంగం భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, జిల్లా ప్రజలకు అందుబాటులో ములుగు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు ఏమైనా సందేహాలుంటే కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కాల్ చేయాలని సీతక్క ప్రజలను కోరారు.
రైతులు ముఖ్యంగా విద్యుత్తు షాక్ ప్రమాదాల గురి కాకుండా జాగ్రతగా ఉండాలని.. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని, జాలరులు చేపల వేటకు వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అదే విధంగా గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను అధికారులు గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతానికి తరలించే విధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ లు కింది స్థాయి అధికారులతో ఇప్పటికప్పుడు మానేటరింగ్ చేయాలని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమములో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.