దుబాయ్ ఎయిర్ షోలో ప్రదర్శన విమానంగా పాల్గొన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానం శుక్రవారం దుర్ఘటనకు గురైన విషయం తెలిసిందే. తీవ్రమైన విన్యాసాల అనంతరం అదుపు తప్పి కూలిపోయిన ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన పైలట్ వింగ్ కమాండర్ నమాంశ్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు. అనుభవం ఉన్న పైలట్ అయిన నమాంశ్ ఆ రోజు ఎనిమిది నిమిషాల పాటు ఆకర్షణీయమైన ఎయిర్ మెనూవర్స్ ప్రదర్శించిన తర్వాత విమానం ఒక్కసారిగా నేలమట్టం కావడం ఘటనకు మరింత విషాదాన్ని తెచ్చింది. ఈ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే కోర్ట్ ఆఫ్ ఇన్క్వైరీని ఏర్పాటు చేసి ఖచ్చితమైన కారణాలను వెలికితీసే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.
ఈ సంఘటనపై HAL తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ దానిని “అసాధారణ పరిస్థితుల్లో సంభవించిన ప్రత్యేక దుర్ఘటన”గా పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న ఏజెన్సీలకు పూర్తి సహకారం అందిస్తామని, ఈ ఘటనతో కంపెనీ వ్యాపార కార్యకలాపాలు, భవిష్యత్ డెలివరీలు లేదా ఆర్థిక పనితీర్పుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, మార్కెట్లో మాత్రం సంచలనం నెలకొంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే HAL షేర్ భారీ ఒత్తిడికి లోనై ఒక దశలో 8 శాతం వరకు పడిపోయి ₹4,205 స్థాయిని తాకింది. ప్రమాదం కారణంగా పెట్టుబడిదారులలో ఏర్పడిన ఆందోళన షేర్‌పై తాత్కాలిక ఒత్తిడిని పెంచింది.
తేజస్ విమానం తమిళనాడులోని సూలూరు స్క్వాడ్రన్‌కు చెందినదిగా తెలిసింది. ఆధునిక సాంకేతికత, స్వదేశీ అభివృద్ధి, భారత రక్షణ వ్యవస్థలో చిహ్నంగా నిలిచిన తేజస్‌పై జరిగిన ఈ ప్రమాదం అంతర్జాతీయ వేదికలపై భారత వైమానిక సామర్థ్యంపై కూడా చర్చలకు దారితీసింది. తేజస్‌ను ప్రపంచ మార్కెట్లో ప్రదర్శించి ఎగుమతి అవకాశాలను పెంచాలనే ఉద్దేశ్యంతో HAL కార్యకలాపాలు కొనసాగుతుండగా, దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన ఈ దుర్ఘటన కంపెనీ ప్రతిష్టపై తాత్కాలిక ప్రభావం చూపించినట్లే కనిపిస్తోంది. అయినప్పటికీ, HAL మరియు IAF కలిసి ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోనున్నట్టు సూచిస్తోంది.


