హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీగా పొగమంచు కమ్ముకుంది. ముఖ్యంగా హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారులపై దట్టమైన పొగమంచు అలముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం పది అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.
పొగమంచు కారణంగా హైదరాబాద్–బెంగళూరు హైవేపై నాలుగు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఇదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కూడా పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా నెమ్మదిగా ప్రయాణం చేశారు. హైదరాబాద్–విజయవాడ హైవేపై కూడా వాహనాలు సాధారణ వేగానికి భిన్నంగా చాలా మందగంగా సాగాయి. అబ్దుల్లాపూర్‌మెట్–ఘట్‌కేసర్ బైపాస్ మార్గంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో డ్రైవర్లు హెడ్‌లైట్స్, హాజర్డ్ లైట్స్ వేసుకుని ప్రయాణం చేయాల్సి వచ్చింది.
సూర్యోదయం అయిన తర్వాత కూడా పొగమంచు తగ్గకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఇంత దట్టమైన పొగమంచును ఎప్పుడూ చూడలేదు” అంటూ పలువురు డ్రైవర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, చలి తీవ్రత, తేమ ఎక్కువగా ఉండటం, గాలుల వేగం తగ్గడం వంటి కారణాల వల్ల నగర శివారుల్లో పొగమంచు ఏర్పడినట్లు తెలుస్తోంది. రాబోయే కొన్ని రోజులు ఉదయం వేళల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. పొగమంచు ఉన్న సమయంలో అధిక వేగంతో ప్రయాణించవద్దని, సేఫ్ డిస్టెన్స్ పాటించాలని, అవసరమైతే మాత్రమే ప్రయాణం చేయాలని సూచించారు.


