ఈ వెజ్ ఫుడ్స్ తీసుకోండి చాలు..
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను తినాలన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాల విషయానికి వస్తే మనకు రెండు రకాల పోషకాలు అవసరం అవుతాయి. ఒకటి స్థూల పోషకాలు. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులను స్థూల పోషకాలు అంటారు. ఇవి మనకు ఎక్కువ శాతం అవసరం అవుతాయి. విటమిన్లు, మినరల్స్. వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి మనకు తక్కువగా అవసరం అవుతాయి. అయితే చాలా మంది నిత్యం పిండి పదార్థాలు, కొవ్వులను తింటుంటారు. కానీ ప్రోటీన్లు ఉండే ఆహారాలను తీసుకోరు. ప్రోటీన్లు అంటే చాలా మంది కేవలం నాన్ వెజ్ ఆహారాల్లోనే ఉంటాయి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పలు వెజ్ ఆహారాల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి. ఇక ప్రోటీన్లు ఉండే వెజ్ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ల వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రోటీన్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కండరాలను నిర్మాణం చేస్తాయి. అలాగే బరువును నియంత్రణలో ఉంచుతాయి. అయితే శాకాహారం తినే వారు కేవలం నాన్‌వెజ్‌లోనే ప్రోటీన్లు ఉంటాయని అనుకుంటారు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. పలు వెజ్ ఆహారాల్లో కూడా ప్రోటీన్లు ఉంటాయి. పనీర్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. రెస్టారెంట్లలో మనకు పనీర్‌తో చేసే అనేక వంటకాలు లభిస్తుంటాయి. దీన్ని మనం ఇంట్లో కూడా వండుకోవచ్చు. ఇక 100 గ్రాముల పనీర్ ద్వారా మనకు సుమారుగా 18 నుంచి 20 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. అందువల్ల వెజిటేరియన్లు పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీంతో ప్రోటీన్లు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
పప్పు దినుసులను కొందరు పక్కన పెడుతుంటారు. కానీ ఇవి ప్రోటీన్లకు అద్భుతమైన నిలయం అని చెప్పవచ్చు. 100 గ్రాముల పప్పు దినుసులను తినడం వల్ల సుమారుగా 7 నుంచి 9 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. వెజిటేరియన్లకు పప్పు దినుసులు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. రోజూ పప్పు తిన్నా కూడా ఎంతో మేలు జరుగుతుంది. మన ఆరోగ్యానికి పప్పు దినుసులు చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పెసలు, శనగలు, కందిపప్పును తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి మనకు అనేక పోషకాలను అందిస్తాయి. కండరాలను నిర్మాణం చేస్తాయి. శరీరానికి శక్తిని అందించి మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. దీంతో మనం యాక్టివ్‌గా పనిచేస్తాం. చురుగ్గా ఉంటాం.
శనగలను చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకోరు. గ్యాస్ వస్తుందని భయపడతారు. కానీ శనగలు ప్రోటీన్లకు అద్భుతమైన నెలవు అని చెప్పవచ్చు. 100 గ్రాముల మేర శనగలను ఉడకబెట్టి తినడం ద్వారా సుమారుగా 8 నుంచి 9 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. శనగలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. నాన్‌వెజ్ తినలేని వారికి మీల్ మేకర్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. వీటిల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల మీల్ మేకర్లను తింటే ఏకంగా 52 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. కనుక నాన్‌వెజ్ తినలేని వారు చింతించాల్సిన పనిలేదు. మీల్మేకర్లను తింటే చాలు, ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. ఇలా వెజిటేరియన్లు పలు ఆహారాలను తినడం వల్ల ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. దీంతో కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా ఉంటారు.