అధికారులను ఆదేశించిన హైడ్రా కమిషనర్..
బేగంపేటలో నాలాల పరిశీలన..
నాలా విస్తరణ పనులు వేగంగా జరగాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. వర్షాకాలం ఆరంభంలో ఉన్నామని.. ఈ నెలాఖరకు సాధ్యమైనంతమేరకు పూర్తి చేయడంతో పాటు.. నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తే .. కొంతమేర వరద ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల ఆక్రమణలను తొలగించిన ప్యాట్నీ నాలా విస్తరణ పనులు సాగుతున్న తీరును కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్, హైడ్రా ఇరిగేషన్, ట్రాఫిక్ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ నెల 6న ప్యాట్నీ నాలా ఆక్రమణలను హైడ్రా తొలగించిన విషయం విధితమే. వాస్తవంగా ఉండాల్సిన 20 మీటర్ల మేర వెడల్పు చేయడంతో పాటు.. ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించారు. ఈమేరకు పనులు ఎంత వరకు వచ్చాయనే విషయాన్ని గమనించారు. నాలాకు ఇరువైపులా 5 మీటర్ల బఫర్ కూడా ఉండేలా చూడాలన్నారు. నాలా విస్తరణ పనులు చేపట్టినందుకు స్థానికులు కమిషనర్‌ను కలిసి అభినందించారు. దశాబ్దాలుగా మునిగిపోతున్నామని.. ఈ సారి వరదముప్పు తప్పించేందుకు చేస్తున్న చర్యలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.
చికోటీ గార్డెన్స్‌లో నాలా పునరుద్ధరణ :
ప్రకాష్‌నగర్ మెట్రో స్టేషన్ దగ్గర బేగంపేట విమానాశ్రయం నుంచి వచ్చే వరద నీటిని తీసుకెళ్లే కాలువ వాస్తవానికి 6 మీటర్లుండాల్సి ఉండగా.. ఎక్కడికక్కడ కనీసం 2 మీటర్లు కూడా లేని పరిస్థితిని జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నందిని హోటల్ వద్ద మొత్తం 1.8 మీటర్లకే పరిమితమైంది. కూకట్‌పల్లి ప్రధాన కాలువ కలిసేవరకు 2 కిలోమీటర్ల పొడవు ఈ నాలా ఉండగా.. కిలోమీటరు మేర ఆక్రమణలకు గురైనట్టు నిర్ధారించారు. ఈ నాలాను పునరుద్ధరించడానికి అధికార యంత్రాంగం సిద్ధమౌతోంది. నాలా విస్తరణకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని అక్కడి స్థానికులు తెలిపారు. అపార్టుమెంట్ల మధ్యలోంచి వెళ్తున్న నాలా విస్తరణకు తమకేమీ అభ్యంతరం లేదని పలు అపార్టుమెంట్ల అసోసియేషన్లు చెప్పాయి. కమిషనర్‌ను కలిసి ప్రతి ఏటా వరద ఉధృతి ఎలా ఉంటుందో నాటి వీడియోలు చూపించారు. మోకాలు లోతు నీటిలో తాము ఇళ్లకు చేరాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న నాలాను 6 మీటర్ల మేర విస్తరిస్తే బేగంపేట ప్రధాన రహదారిపై నుంచి వచ్చే వరద నీరు సాఫీగా సాగేందుకు వీలు కలుగుతుందన్నారు.
చింతలబస్తీలో నాలా పరిశీలన :
శంకరపల్లిలోని బుల్కాపూర్, కొంపల్లి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్‌పేట, మెహిదీపట్నం, బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 మీదుగా చింతలబస్తీలోకి ప్రవేశించి హుస్సేన్‌సాగర్‌లో కలిసే బుల్కాపూర్ నాలాను కూడా హైడ్రా కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. పింఛను ఆఫీసు దగ్గర చింతలబస్తీలోకి ప్రవేశించే చోట నాలాను కబ్జా చేసి దుకాణాలు నిర్మించడాన్ని తీవ్రంగా పరిగణించారు. వరద ఫ్లోకు అడ్డుకట్ట వేసే మాదిరి ఆక్రమించి ఇసుక, సిమెంట్ వ్యాపారాలు చేసుకోవడమేంటి అని ప్రశ్నించారు. ఇలా చింతలబస్తీలో పలు చోట్ల నాలా కబ్జాలను పరిశీలించారు. నాలాను ఆక్రమించి కల్లు కాంపౌండ్ నిర్మించడాన్ని చూసి.. వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. నాలాలో వరద నీరు సాఫీగా సాగేలా చూడాలని అధికారులకు సూచించారు. పేరుకుపోయిన చెత్తను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు.


