జగన్ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైంది..
రివర్స్ టెండరింగ్ పేరుతో డయాఫ్రం వాల్‌ను ధ్వంసం చేశారని అనగాని తీవ్ర విమర్శ..
పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చకు రావాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు విసిరిన సవాల్‌పై రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రాజెక్టును పూర్తిగా గాలికొదిలేసిన వైసీపీ నేతలు ఇప్పుడు సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును ముంచింది జగన్ అయితే, దాన్ని పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… జగన్ ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టును వరదల్లో ముంచి, రివర్స్ టెండరింగ్ అనే పేరుతో డయాఫ్రం వాల్‌ను పూర్తిగా విధ్వంసం చేశారని అనగాని ఆరోపించారు. కేంద్రం కేటాయించిన నిధులను సైతం దుర్వినియోగం చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం నిర్వాసితులకు ఒక్క రూపాయి అయినా ఖర్చు చేసిందా అని ఆయన ప్రశ్నించారు. మొత్తం పాలనలో 3.40 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారని, బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించలేదని గుర్తుచేశారు. “పోలవరం నాకు అర్థం కావడం లేదు, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను” అని గతంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు.
26 నెలల పాటు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునైనా సందర్శించి పనులు వేగవంతం చేసే ప్రయత్నం చేశారా అని అనగాని నిలదీశారు. వైసీపీ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 33 మంది మరణించారని, గుండ్లకమ్మ, పులిచింతల, ఎర్రకాలువ వంటి అనేక ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయని, వీటన్నింటికీ జగన్ ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆరోపించారు. దమ్ముంటే ఈ ప్రాజెక్టుల విధ్వంసంపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పనులపై ప్రత్యేక దృష్టి సారించారని అనగాని తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించి, నిర్వాసితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. కేంద్రం నుంచి రూ.12,157 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం సాధించామని, ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న నిర్వాసితుల ఖాతాల్లో రూ.1000 కోట్లు జమ చేశామని వివరించారు. రాష్ట్ర బడ్జెట్‌లో పోలవరం కోసం రూ.6,705 కోట్లు కేటాయించామన్నారు.
ప్రస్తుతానికి పోలవరం పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఈ 14 నెలల్లోనే 6 శాతం పనులను విజయవంతంగా పూర్తి చేశామని మంత్రి స్పష్టం చేశారు. రూ.990 కోట్లతో చేపట్టిన నూతన డయాఫ్రం వాల్ నిర్మాణం 500 మీటర్లు పూర్తయిందని, ఎడమ కాలువ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. చెప్పిన సమయానికి, అంటే 2027 డిసెంబర్ నాటికి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసలు పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని, చర్చకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని అనగాని సత్యప్రసాద్ పునరుద్ఘాటించారు.