బనకచర్ల ప్రాజెక్టు కడతామనే ప్రతిపాదన రాలేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి
కేంద్రం కేవలం నిర్వాహక పాత్ర పోషించిందన్న రేవంత్ రెడ్డి..
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల విషయంలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు అధికారులు, ఇంజినీర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామనే ప్రతిపాదన ఈ సమావేశంలో రాలేదని ఆయన తేల్చి చెప్పారు. అలాంటి ప్రతిపాదనే రానప్పుడు దానిని ఆపాలనే చర్చ కూడా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది అపెక్స్ కమిటీ సమావేశం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
గతంలో కేసీఆర్ తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే ఈ సమావేశం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రం ఎవరి పక్షానా మాట్లాడలేదని, కేవలం సమన్వయకర్త పాత్ర మాత్రమే పోషించిందని ఆయన పేర్కొన్నారు.