Tuesday, August 5, 2025
Google search engine
Homeడివోషనల్బిల్వాష్టకం - బిల్వపూజ ఎంతో శ్రేష్టం..

బిల్వాష్టకం – బిల్వపూజ ఎంతో శ్రేష్టం..

బిల్వపత్రం అంటే మారేడు ఆకు..
పరమ శివుడికి అత్యంత ప్రీతికరం ఈ బిల్వపత్రం..

శివ పూజకు అత్యంత శ్రేష్ఠమైనది మారేడు ఆకు. దీనినే సంస్కృతంలో బిల్వ పత్రం అంటారు. మారేడు చెట్టుకి వచ్చే ఆకులు విశేషమైన ఆకారం లో ఉంటాయి. మూడు ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టి త్రిదళం అని పేరు పొందాయి.. ఇది మూడు గుణాలకు ప్రతీకగా (సత్వ రజస్తమో గుణములు), పరమశివుని మూడు కన్నులుగా, మూడు జన్మల పాపాన్ని హరించేదిగా చెప్పబడింది. ఈ బిల్వపత్రాలు ఎండినా కూడా పూజలో వినియోగించ వచ్చు. మారేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బిల్వపత్రాల మహిమ గురించి రాసిన బిల్వాష్టకం తాత్పర్యం మీకోసం.

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం

తా : మూడు దళాలు కలిగిన, మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నులవలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

తా : మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను.

అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం

తా : ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం

తా : సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమ యాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం

తా : కోటి ఏనుగుల దానం ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల ఫలం తో సమానమైన ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం

తా : లక్ష్మీ దేవీ స్తన్యము నుండి జన్మించిన, శివునికి ఎంతో ప్రియమైన, బిల్వ వృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం

తా : దర్శనం, స్పర్శనం వలన మహా పాపాలను నాశనం చేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

తా : కాశీ నివాసం, కాల భైరవుని దర్శనం, ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం

తా : మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కొసలో శివుని కలిగిన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

ఫలశృతి బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్

ఫలశృతి : శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకం పఠనం చేయటం వలన పాపాలు తొలగి, పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments