ఓ కార్యక్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పేర్ని నాని..
చీకట్లో కన్నుకొడితే పనైపోవాలంటూ వ్యాఖ్యలు..
మండిపడుతున్న టీడీపీ నేతలు
‘‘చీకట్లో నరికేయండి” అని వైసీపీ నేత పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల సత్యనారాయణ కూడా పేర్న నాని వ్యాఖ్యలను ఖండించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లడారు.
‘‘గత ఎన్నికల ఫలితాల్లో జగన్ నిరంకుశ, అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి.. ప్రతిపక్ష హోదా దక్కకుండా.. ఘోరంగా ఓడించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వం అత్యంత అధిక మెజార్టీతో అధికారాన్ని ఇచ్చారు. మీరు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ర్పచారం చేస్తూన్నారు. రప్పా.. రప్పా.. చీకట్లో కన్నుకొడితే పని అయిపోవాలి.. తలలు లేచిపోవాలి.. అని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం..? మాజీ మంత్రిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పేర్ని నాని ప్రజాస్వామ్యన్ని రక్షించేవిధంగా మాట్లాడాలి. కానీ, హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడటం దారుణం.
ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది.. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో హింసను ఎట్టిపరిస్థితుల్లో ప్రొత్సహించరు. గత ప్రభుత్వంలో జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి.. అవినీతి మయంగా, ఆరాచకంగా మార్చారు. గతంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలపై దాడులు చేసి, హత్యలు చేశారు. అది మీ సంస్కృతి.. ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు.
పేర్ని నాని మీద బందరులో ఎన్నో అభియోగాలు ఉన్నాయి! నువ్వు ఎన్ని నేరాలు చేశావ్.. గోడౌన్ లో రేషన్ బియ్యం ఎక్కడికి పోయాయి? రంగనాయకుల గుడి 10 ఎకరాల స్థలానికి ఏమి సమాధానం చెబుతావు… బీచ్ పక్కన ఉన్న గుడిసెలను తగలబెట్టారు… దానికి ఏమి సమాధానం చెబుతావు… దమ్ముంటే అక్కడికి వెళ్లి మాట్లాడాలి. పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తమ్మిన వారి సత్రానికి చెందిన 1000 గజాల స్థలాన్ని అక్రమించుకున్నారు. పేర్ని నాని తండ్రి పేర్ని విష్ణుమూర్తి ఎనాడూ కూడా హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడలేదు.
కానీ, నీ ప్రవర్తన ధోరణీ మీ నాయకుడు మెచ్చుకునే విధంగా ఉంది. హింసను ప్రోత్సాహించి.. పరుష పదజాలంతో వేరే పార్టీ వారిని తిడితే మీ నాయకుడికి ఆనందం.. జగన్ ఓదార్పు యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు… ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తే.. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం యువనేత నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తే అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. బెదిరింపులు మాటలతో ప్రజలను భయబ్రాంతులను గురి చేయడం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు’’ అని అన్నారు.