ఇది తెలంగాణ ప్రజా ప్రభుత్వం..
కొనియాడిన కప్పాటి పాండురంగా రెడ్డి..
తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచేలా వారి సంక్షేమం, అభ్యున్నతికి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వివిధ పథకాల కింద రూ.54,280 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చుచేసింది అని ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్, మీడియా కోఆర్డినేటర్ కప్పాటి పాండురంగా రెడ్డి.. ‘‘అధికారం చేపట్టిన వెంటనే రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసింది. కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.22 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.17,869 కోట్ల రుణమాఫీ చేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని నిరాటంకంగా కొనసాగించింది. ఉచిత విద్యుత్తుకు ఈ ఏడాది రూ.10,444 కోట్లు సబ్సిడీ కింద చెల్లించింది. అధికారం చేపట్టిన తొలి మూడు నెలల్లోనే రైతుభరోసా నిధులను పంపిణీ చేసింది.. యాసంగి సాగుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.5 వేల చొప్పున మొత్తం 1,57,51,000 ఎకరాలకు రూ.7,625 కోట్లను 69,86,519 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. పంటలు నష్టపోతే రైతులకు పరిహారం అందేలా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించింది. ప్రీమియం చెల్లించేందుకు రూ.1,300 కోట్లు కేటాయించింది. ఎవరైనా రైతులు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా పరిహారం బాధిత కుటుంబానికి అందిస్తోంది. రైతు బీమాకు ప్రీమియం కింద రూ.1,455 కోట్లు చెల్లించింది. గత యాసంగి సీజన్‌లో దాదాపు 9 లక్షల మంది రైతుల నుంచి రూ.10,547 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వారికి కేవలం మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించింది. ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆయా రకాల సాగు పెరిగింది. వానాకాలం సీజన్‌లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు, వారితో అధికారులు నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు రైతు నేస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది అని పాండురంగా రెడ్డి తెలిపారు.