నిరంతరం పర్యవేక్షణలో ఉంటున్న హైడ్రా..
ఎక్కడా నీళ్లు నిలువకుండా తగిన జాగ్రత్తలు..
వర్షం పడితే వరద ముంచెత్తకుండా హైడ్రా నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఆర్‌యూబీలు, వంతెనలను పరిశీలించి ఎక్కడా నీరు నిలవకుండా జాగ్రత్త పడుతోంది. గత రెండు మూడు వర్షాలు నేర్పిన పాఠాలను హైడ్రా ఆకలింపు చేసుకుంది. వరద నివారణ చర్యలను ముమ్మరం చేసింది. వంతెనలపైన నీరు వెళ్లేందుకు ఉన్న రంద్రాలను తెరిపిస్తోంది. కొండాపూర్‌లోని కొత్తగూడ వంతెన, అఫీజ్‌పేట్ వంతెనలపైన ఉన్న రంద్రాలన్నీ తెరిచింది. అలాగే నగరంలోని అన్ని వంతెనలపైన నీరు నిలవకుండా చర్యలు తీసుకుంది. మదీన గూడ దగ్గర నాలా క్లీనింగ్ పనులు చేశారు.

ఆర్‌యూబీల వద్ద సంపులు నిర్మించి ఆటోమేటిక్‌గా నీటిని తోడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అవి కొన్ని చోట్ల పని చేయకపోవడం… సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో తలెత్తిన ఇబ్బందుల పరిష్కారంపై హైడ్రా దృష్టి పెట్టింది. మంగళవారం మెహిదీపట్నం, మాధాపూర్ ప్రాంతాల్లో వర్షం పడుతున్నప్పుడు హైడ్రా ఎమర్జన్సీ, డీఆర్ ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో ఉండి.. వరద నిలవకుండా చర్యలు తీసుకున్నాయి. అలాగే చింతల్ , ఎల్‌బీనగర్ ఆర్‌యూబీలను కూడా హైడ్రా అధికారులు పరిశీలించారు. కాటేదాన్ అండర్ పాస్ (ఆర్‌యూబీ) వద్ద నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం చేశారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, ఆర్ ఎఫ్‌వో జయప్రకాష్, డీఎఫ్‌వో యజ్ఞనారయణ తదితరులు క్షేత్ర స్థాయిలో ఈ పనులను పరిశీలించారు.
