అవసరమైతే కొత్త పైపులైను వేయండి..
కీలక ఆదేశాలిచ్చిన హైడ్రా కమిషనర్
మురుగు, వరద ముప్పు ఉన్న అక్బర్‌బాగ్ ప్రాంతాన్ని జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో సమస్యను తెలుసుకున్నారు. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం పడిన ప్రతిసారీ ఈ సమస్య తలెత్తుతోందని స్థానికులు కమిషనర్‌కు తెలిపారు. పైనుంచి వచ్చిన వరద, మురుగు నీరును సాఫీగా మూసీలో కలిపే జంక్షన్ లైను దెబ్బ తినడంతో ఈ సమస్య తలెత్తుతోందని స్థానికులతో పాటు.. అధికారులు చెప్పగా .. పరిష్కార మార్గాలపై అక్కడే చర్చించారు. దాదాపు వంద మీటర్ల మేర ఉన్న పైపు లైనులో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలు, చెత్తను తొలగించడానికి హై ప్రజర్ జెట్టింగ్ మిషన్లతో ప్రయత్నించాలని సూచించారు. లేని పక్షంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడకుండా కొత్త పైపు లైను నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేయాలనే ప్రతిపాదన చేశారు. కోఠి నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే మార్గంలో మలక్‌పేట రైల్వే స్టేషన్ – నల్గొండ చౌరస్తా మధ్య మెట్రో పిల్లర్ నంబరు 1417 – 1420 మధ్య ఈ సమస్య తలెత్తిన విషయం విధితమే. పై నుంచి వచ్చిన వరద నీరు రోడ్డుమీద నిలవడంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడంతో హైడ్రా, జీహెచ్ ఎంసీ కమిషనర్లు సంయుక్తంగా పరిశీలించారు.


