Monday, July 21, 2025
Google search engine
Homeఇంటర్నేషనల్విచిత్రమైన వలస జీవితాలు..

విచిత్రమైన వలస జీవితాలు..

కళ్ళు చెదిరే వాస్తవాలు..
రాజకీయ, మతపరమైన అంశాలు, హింస అనేవి లేవు..
మెరుగైన జీవితం కోసం వలసపోవడం చూసాం..
వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడీ దుర్భర పరిస్థితి నెలకొంది..
ఒక దేశం యావత్తూ శాశ్వతంగా వదిలేయాల్సిన దారుణం..
పిల్లా పాపలతో ఎక్కడికి వెళ్తారు..? ఎలా బ్రతుకుతారు..?
ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందిస్తున్న ఓ ఆసక్తికర కథనం..

కరువు, కాటకాలు.. ఉపాధిలేకపోవడం, రాజకీయ హింస, మతపరమైన అలజడులు.. ఇలాంటివి ఎదురైనప్పుడు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు వలసపోవడం మనం చూస్తూ ఉంటాం.. ఇది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అవుతుంది.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్వల్ప సంఖ్యలో వలసవెళ్లే ప్రజలు మరోచోట ఎలాగోలా ఒక ప్రాంతంలో అవకాశం ఉంటుంది.. కానీ ఇవేవీ కారణాలు కాకుండా.. కేవలం వాతావరణ మార్పుల నుంచి తప్పించుకోవడానికి వలస వెళ్లాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.. అదీ కాకుండా ఏకంగా ఒక దేశమే వలస వెళ్లాల్సి వస్తోంది.. వూహించుకోవడానికే ఇది భయానకంగా ఉంది.. మరి అక్కడి ప్రజల మానసిక స్థితి గతులు ఎలా వుంటాయో..? ఆలోచిస్తే ఒళ్ళు గగుర్పొడచక మానదు.. అలాంటి కథనం మీ కోసం..

లేలేత నీలి రంగు సముద్ర జలాలు.. పగడపు దిన్నెలు.. ఎంతో పొడవైన కొబ్బరి చెట్ల వరుసతో ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న ఒక చిన్న ద్వీపదేశం తువాలు.. ఇక్కడి జీవనం సాంప్రదాయమైన నృత్య, సంగీతాలతో మేళవించుకుని ఉంటుంది.. దాదాపు మూడువేల సంవత్సరాల సాంస్కృతిక వైభవం అక్కడ నివసిస్తున్న ప్రజల సొంతం. ఈ ద్వీపదేశం హవాయ్, ఆస్ట్రేలియాల నడుమ పసిఫిక్‌ మహా సాగరంలో తొమ్మిది ద్వీపాలతో కూడిన ఈ అందమైన దేశానికి ఇప్పుడు ఊహించని ముప్పు వచ్చిపడింది. శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న ప్రకారం మరికొన్ని దశాబ్దాల్లోనే ఈ దేశం పూర్తిగా కనుమరుగు కానుందట.. నేలతో పాటు అక్కడి జన జీవితాలనూ వేడెక్కిన సముద్ర జలాలు కబళించబోతున్నాయట.. కాగా తువాలు భూభాగం సముద్ర మట్టానికి కనిష్ఠంగా 6.6అడుగులు, గరిష్ఠంగా 15అడుగుల ఎత్తులోనే ఇప్పుడు ఉంది.. అంతా కలిపితే మహా 25.14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది.. సుమారుగా ఇక్కడ 10,643 మంది జనాభా ఉంటారు.. కాగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో తుపానుల ఉద్ధృతి, సముద్ర మట్టం పెరుగుతుంటే, అలల తాకిడికి నేల కొంచం కొంచంగా కోసుకుపోతోంది. తాగునీటి వనరులు ఉప్పునీటితో కలిసిపోతున్నాయి.. వ్యవసాయం, జీవనోపాధులు విపరీతంగా దెబ్బతినిపోతున్నాయి. దీంతో ఇప్పటి పరిస్థితులు తువాలును నివాసానికి పనికిరాకుండా చేస్తున్నాయి. వాతావరణ మార్పులు ఎంతటి విధ్వంసాన్నీ విషాదాన్నీ మిగులుస్తాయో ఆ దేశ ప్రజల దుస్థితే చెబుతోంది. భారత్‌ సహా అనేక దేశాల తీరప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలే మనకు కనిపిస్తాయి..

పరిశోధకుల అంచనా ప్రకారం, 2050 నాటికి తువాలు రాజధాని ఫునాఫుటిలో సగం భాగం వరదలతో మునిగిపోనుంది. 2100 నాటికి ఆ దేశంలో 95శాతం భూభాగం జలమయం కావచ్చు. తువాలు ప్రజల సగటు వయసు దాదాపు 29 సంవత్సరాలు. ఏదో ఒక వృత్తిలో కుదురుకుని, కుటుంబ జీవితాన్ని కట్టుకోవాల్సిన తరుణంలో ఇలా వారి భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయింది.. గాలిలో దీపం లాగా అవుతోంది. అయితే, 2023లో ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న ‘ఫలేపిలి యూనియన్‌ ట్రీటీ’ తువాలు వాసులకు ఆశాకిరణంలా మారింది. ఈ ఒప్పందాన్ని అనుసరించి ఏటా 280 మంది తువాలు పౌరులకు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసంతో పాటు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఇటీవలే పసిఫిక్‌ ఎంగేజ్‌మెంట్‌ వీసా కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే, 4052 మందికి సంబంధించి మొత్తం 1124 దరఖాస్తులు అందాయి. త్వరలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేపడతారు. మరోవైపు, వీసా నిషేధాన్ని ఎదుర్కొంటున్న 36దేశాల జాబితా నుంచి తువాలును తొలగిస్తున్నట్లు అమెరికా తాజాగా వెల్లడించింది ఇది కొంతమేర ఆనందించాల్సిన విషయం..

దురదృష్ట వశాత్తూ తమ కళ్లెదుటే కనుమరుగవుతున్న తమ భూభాగాన్ని పరిరక్షించుకోవడానికి తువాలు ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ‘కోస్టల్‌ అడాప్టేషన్‌ ప్రాజెక్ట్‌’ కింద ఐక్యరాజ్యసమితి గ్రీన్‌ క్లైమేట్‌ ఫండ్, ఆస్ట్రేలియాల సాయంతో ఫొంగఫలే, నానుమాగా, నానుమీ దీవుల్లో 3.6 చదరపు కిలోమీటర్ల మేర నేలను ఎత్తు చేస్తోంది. అక్కడ నీటి సరఫరా, ఆహార భద్రతకు చర్యలు తీసుకుంటోంది. ‘డిజిటల్‌ నేషన్‌ ఇనీషియేటివ్‌’ ద్వారా భావితరాలకు తన సాంస్కృతిక వారసత్వాన్ని అందించేందుకూ ప్రయత్నిస్తోంది. తువాలు ఒక్కటే కాకుండా కిరిబాటి, మాల్దీవులు, మార్షల్‌ ఐలాండ్స్‌ వంటి తక్కువ ఎత్తున్న ద్వీపదేశాలు సైతం సముద్రమట్టాల ఉద్ధృతి మూలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి సుమారు 21.6 కోట్ల మంది వాతావరణ కారణంతో వలసలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. కాబట్టి, తువాలు వంటి దేశాలవారికి చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిదే. ప్రస్తుతమున్న యూఎన్‌ రెఫ్యూజీ కన్వెన్షన్‌-1951 వంటివి హింస లేదా రాజకీయ అణచివేతను ఎదుర్కొంటున్న వారికి మాత్రమే వర్తిస్తాయి. 2018 నాటి ‘గ్లోబల్‌ కాంపాక్ట్‌ ఫర్‌ మైగ్రేషన్‌’ వాతావరణ వలసలను గుర్తిస్తున్నా, చట్టపరమైన హామీ ఇవ్వదు. కాబట్టి, వాతావరణ కారక నిరాశ్రయులనూ పర్యావరణ వలసదారులనూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరముంది. ముఖ్యంగా మానవతా వీసాల జారీకీ, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా దేశాల మధ్య వలసలకు అంగీకారం కుదర్చడానికీ గట్టి కృషి జరగాలి. ఐరాస ఆధ్వర్యంలో ‘నాన్సెన్‌ ఇనీషియేటివ్‌’ కింద వలసలకు రక్షణ కల్పించే డిజాస్టర్‌ డిస్‌ప్లేస్‌మెంట్‌ కార్యక్రమానికి 109 దేశాల మద్దతు ఉంది. దీన్ని చట్టపరంగా బలోపేతం చేయడంతో పాటు వాతావరణ నిధి, యూఎన్‌ఎఫ్‌సీసీసీ నష్టపరిహార నిధిని బాధితుల పునరావాసానికి వెచ్చించాలని పలుదేశాల్లో కోరుతున్నాయి.. 1954, 1961 స్టేట్‌లెస్‌నెస్‌ కన్వెన్షన్‌లను విస్తరించడం ద్వారా.. పూర్తిగా నీటమునిగే తువాలు వంటి దేశీయుల హక్కులను పరిరక్షించాలని, మానవతా దృక్పధంలో ఐక్యరాజ్య సమితి స్పందించాలని ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అభ్యర్థిస్తోంది..

తువాలు దుస్థితిని హెచ్చరికగా భావించి, మనమూ మేలుకోవాలి. భారతదేశానికి 11,098 కిలోమీటర్ల మేర సముద్ర తీరముంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల సుందర్బన్‌ అడవులు, లక్షద్వీప్, అండమాన్‌-నికోబార్‌ దీవులు, చెన్నై, ముంబయి, కోల్‌కతా, విశాఖపట్నం వంటి చోట్ల నేల కోతకు గురవుతోంది. సముద్ర జీవుల ఆవాసాలు, జీవవైవిధ్యం దెబ్బతినిపోతున్నాయి. ఎంతోమంది మత్స్యకారులు, గ్రామీణులు స్థానికంగా ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలంటే శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి, ఆ మేరకు పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలి. చెరువులు, నదులు, సాగరాల్లో వ్యర్థాలు, రసాయనాల పారబోతను అడ్డుకోవడంతో పాటు తీర ప్రాంతాల పరిరక్షణకు పెద్దపీట వేయాలి. అందుకు దేశీయంగా మరెంతో కృషి అవసరం. ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న వాతావరణ మార్పుల కట్టడికి అన్ని దేశాలూ గట్టి ప్రయత్నం చేయకపోతే ఏదో ఒకరోజు యావత్‌ మానవాళి మనుగడకూ పెనుముప్పు తప్పదు అని హెచ్చరిస్తున్నాం..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments