నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం వ్యాఖ్యలు
మహిళలను అవమానిస్తూ జగన్ ఏం సాధిస్తున్నట్టు అని ప్రశ్న
తల్లి, చెల్లి కూడా దగ్గరకు రానివ్వని జన్మ ఎందుకంటూ ఆగ్రహం
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అధినేత జగన్ పై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. తల్లి, చెల్లి కూడా దగ్గరకు రానివ్వని జన్మ ఎందుకంటూ మండిపడ్డారు. మహిళలను అవమానిస్తూ జగన్ ఏం సాధిస్తున్నట్టు అని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలు నీకు అవసరమా… సమకాలీన రాజకీయాలకు నువ్వు అనర్హుడివి అంటూ జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. ఇక నీ పార్టీకి భవిష్యత్తు లేదు… నీ పార్టీ కనుమరుగైపోతుందే తప్ప, కోలుకునే పరిస్థితి లేదు అని స్పష్టం చేశారు.
వైసీపీలో ఎవరైనా ఒకరిద్దరు విజ్ఞులు మిగిలి ఉంటే వారు విచక్షణతో ఆలోచించి బయటికి వచ్చేయాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు. లేకపోతే జగన్ తో పాటే మీరూ కొట్టుకుపోతారని అన్నారు. జగన్ రౌడీలకు అధినేతో, గంజాయి గ్రూపులకు నాయకుడో తెలియడంలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు బయటపడతాయని జగన్ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.