- ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ప్రత్యేక అంతర్జాల వేదికను ప్రారంభించాలని ఆచార్య కోదండరాం ను కోరిన కప్పాటి.పాండురంగా రెడ్డి బృందం.
- ప్రత్యేక రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల ఆశయాలకు అనుగుణంగా గుర్తింపు ప్రక్రియ జరగాలని డిమాండ్
- గత పాలకుల నిర్లక్ష్యంతో ఆర్థిక, మానసిక కుంగుబాటుకు గురవుతున్న అసలైన ఉద్యమకారుల ఆవేదన
హైదరాబాద్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం సాగించిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి తాత్సారం లేకుండా త్వరగతిన న్యాయం చేయాలని పలువురు తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు ఆచార్య కోదండరాంను పలువురు ఉద్యమ నేతలు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ పూర్వ అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకట్ రెడ్డి, సీనియర్ పాత్రికేయుడు బొల్లారం వెంకట్ రెడ్డి, ఆర్.కె. తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
ఉద్యమకారుల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది అమరుల ఆత్మబలిదానం, సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని వారు గుర్తు చేశారు. 2001 నుంచి 2014 వరకు సాగిన మలిదశ ఉద్యమంలో సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, రైలు రోకోల వంటి చారిత్రక ఘట్టాల్లో ప్రత్యక్షంగా పాల్గొని కేసులు ఎదుర్కొన్న అసలైన ఉద్యమకారులకు రాష్ట్ర ఏర్పాటు తర్వాత తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన గత పాలకులు ఉద్యమకారులకు కనీస గుర్తింపు ఇవ్వకపోగా, ఉద్యమ ద్రోహులతో చేతులు కలిపి అసలైన పోరాట యోధులను ఘోరంగా అవమానించి, తీరని ద్రోహం చేశారని విమర్శించారు.
ప్రస్తుతం ఎందరో ఉద్యమకారులు అవమాన భారం, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కుటుంబ చీదరింపులతో చెప్పుకోలేని దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వారు పేర్కొన్నారు. సామాజిక గుర్తింపు కోల్పోవడం, ఆర్థిక అభద్రత పెరగడం వల్ల పోరాట యోధులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఇటీవల ఇద్దరు ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడిన హృదయవిదారక ఘటనలే ఇందుకు నిదర్శనమని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల హామీకి అనుగుణంగా ఉద్యమకారులు దరఖాస్తు చేసుకునేందుకు తక్షణమే ప్రత్యేక అంతర్జాల వేదికను ప్రారంభించాలని వారు కోరారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, కళాకారుల విభాగాల ద్వారా భాగస్వాములైన ఉద్యమకారులు, నాయకులను పారదర్శకంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తక్షణమే స్పందించి, ముఖ్యమంత్రి నిర్ణయంతో ప్రజా ప్రభుత్వం ద్వారా నిజమైన ఉద్యమకారులకు తగిన ఆర్థిక, సామాజిక న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు సంతోష్ ముదిరాజ్, రాజ్ కుమార్, యాతం బాల్ రాజ్ యాదవ్, కిరణ్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


