బడంగ్ పేట్, నవంబర్ 25 (భారత శక్తి);
మహేశ్వరం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, జల్పల్లి సర్కిల్ పరిధిలోని పహాడీ షరీఫ్ 64వ డివిజన్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న న్యూ బాబా నగర్లో రూ.88 లక్షల అంచనా వ్యయంతో, వాది ముస్తఫాలో రూ.1.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం రూ.2.13 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులతో స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


