శేరిలింగంపల్లి :
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ సాయి రామ్ కాలనీలో స్థానిక చిన్నారులు, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు మెరుగైన పౌష్టికాహారం, ప్రాథమిక విద్యను అందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ అంగన్వాడీ కేంద్రం ను డీసీ శ్రీనివాస్, డిడబ్ల్యూఓ శాంతిశ్రీ, సీడీపీఓ కవితలతో కలిసి ముఖ్యఅతిథిగా పిఏసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో 0 నుండి 6 సంవత్సరాల వయస్సు పిల్లలకు, గర్భిణీలకు మరియు పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం అందించడమే మొబైల్ అంగన్వాడీ వాహనాల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. బస్తీ లలో తిరుగుతూ పిల్లలకు పోషక ఆహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు. ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారం అందుతుందని తెలిపారు.
మొబైల్ అంగన్వాడీ లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్యను బోధిస్తారు అని, పిల్లలు మరియు తల్లులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.టీకాలు (ఇమ్మ్యూనిజషన్ ) పిల్లలకు అవసరమైన వ్యాధి నిరోధక టీకాలు వేయడంలో సహకరిస్తారు. పోషకాహారం, ఆరోగ్యంపై తల్లులకు అవగాహన కల్పిస్తారు అని తెలియచేశారు.పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలను సమగ్రంగా అందిస్తూ చిన్నారుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. చిన్నారులకు పోషకాహారం అందించేందుకు విద్యా, ఆట వస్తువులు, ఎర్లీ చైల్డ్ కేర్ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. నర్సరీ విద్య పూర్తి చేసిన చిన్నారులకు ప్రత్యేక సర్టిఫికెట్లు కూడా అందిస్తామన్నారు. అంగన్వాడీ టీచర్లకు ఇంగ్లీష్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు.
పిల్లలను లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే బదులు అంగన్వాడీల్లో చేర్పించాలని సూచించారు. అత్యుత్తమ వాతావరణంలో వారిని తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయగల సామర్థ్యం అంగన్వాడీ వ్యవస్థకు మాత్రమే ఉందని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, అక్తర్,ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,సురేష్, సాదిక్ స్థానిక ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



