హైడ్రా ప్రజావాణికి అందిన 49 ఫిర్యాదులు..
సత్వరమే స్పందించిన హైడ్రా కమిషనర్..
ఇంటి ఎదురుగా రోడ్డు ఉంటే కలిపేయడం.., పార్కు ఉంటే ఆక్రమించేయడం.. కాలువ పైనే నిర్మాణం చేసేయడం.. కబ్జాలకు ఏదీ అడ్డు రావడంలేదని పలు ఫిర్యాదులను బట్టి అర్థమౌతోంది. ఎదురుగా ఉన్న ప్లాట్‌కు దారి లేకుండా మరీ కబ్జా చేసేస్తున్నారంటూ పలువురు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. రహదారులను ఆక్రమించడం.. అడ్డంగా గోడ కట్టేయడంతో దారి లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆఖరుకు 20 గజాల స్థలాన్నికూడా వదలడంలేదని.. గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ వద్ద కబ్జా రుజువు చేస్తోంది. నాలాలు పైన ఉన్న వెడల్పు కిందకు వచ్చేసరికి విస్తరించాల్సింది పోయి.. కుంచించుకు పోయిన దృశ్యాలు అనేకం ఉన్నాయి. ఇలా సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 49 ఫిర్యాదులు రాగా.. అందులో ఎక్కువ శాతం రహదారులు, పార్కుల ఆక్రమణలపైనే ఉన్నాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఆ సమస్య పరిష్కార బాధ్యతలు అప్పగించారు.

అందిన ఫిర్యాదులు ఇలా ఉన్నాయి :
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సిద్ధివినాయకనగర్‌లో 30 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రహదారిని ఎదురుగా ఉన్న ప్లాట్ యజమానులు కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేశారు. 7 ఎకరాల మేర వేసిన ఈ లే ఔట్‌లో 102 ప్లాట్లు వేయగా.. రోడ్డును కబ్జా చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలం, బొడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల గ్రామానికి చెందిన చిన్న క్రాంతి కాలనీలో పార్కును కబ్జాచేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 114, 118, 120, 121లలో సుమారు 1800 గజాల పార్కు స్థలాన్ని అనధికారికంగా నకిలీ ప్లాట్ నంబర్లు వేసి ఆక్రమించేశారని పేర్కొన్నారు. కాలనీవాసులకు కేటాయించిన పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా, తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని పోథాయపల్లి గ్రామంలో నివాసం ఉన్న కొందరు స్థానికులు తమ ఇంటికి వెళ్లే రహదారిని కబ్జా చేశారంటూ స్థానికులు పిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది రహదారిపై అక్రమంగా గోడ నిర్మించి దారిని పూర్తిగా మూసేసి నిర్మాణం కూడా చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కారణంగా తమ ఇంటికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితులు వాపోయారు.
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలోని, కొండాపూర్ జూబిలీ గార్డెన్ కాలనీలో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జాలను వెంటనే ఆపాలని కాలనీవాసులు ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. కొత్తగూడ గ్రామం సర్వే నెం. 30లో 14 గుంటలు, సర్వే నెం. 29లో 1 ఎకరం 2 గుంటల భూమి ప్రభుత్వానికి చెందినదిగా రికార్డుల్లో ఉంది. కాంపౌండ్ వాల్ ను శేరిలింగంపల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కూడా కూల్చారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం భూమిని సరిగా గుర్తించి.. తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ప్రజావాణి లో ఫిర్యాదు చేసారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లికి చెందిన ఫీర్జాదీగూడలోని 30 అడుగుల రహదారిని కబ్జా చేశారంటూ శ్రీ సాయి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతంలోని పంచవటి కాలనీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ రహదారిని ఆక్రమిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు.