పర్యావరణ కారణాలతో నిలిపివేసిన యూఎస్ వైమానిక దళం..
పసిఫిక్ దీవి జాన్‌స్టన్ అటాల్‌లో జరగాల్సిన ప్రయోగాలు..
ఎలాన్ మాస్క్ కు ఎదురుదెబ్బ..
అమెరికా తలపెట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక హైపర్ సోనిక్ రాకెట్ కార్గో ప్రాజెక్టుకు పర్యావరణవేత్తల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థతో కలిసి చేపట్టాలనుకున్న ఈ ప్రయోగాలను పర్యావరణ కారణాలతో నిలిపివేస్తున్నట్లు యూఎస్ వైమానిక దళం ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రమైన జాన్‌స్టన్ అటాల్ దీవిలో ఈ పరీక్షలు నిర్వహించాలని తొలుత ప్రణాళిక వేశారు.
హవాయికి నైరుతి దిశలో దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి ఉంది. ఇక్కడ లక్షలాది సముద్ర పక్షులు గూళ్లు కట్టుకుని నివసిస్తుంటాయి. ఈ ప్రాంతంలో హైపర్సోనిక్ రాకెట్ పరీక్షలు నిర్వహిస్తే, ఆ పక్షుల జీవనానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని జీవశాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పర్యావరణవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, యూఎస్ వైమానిక దళం వెనక్కి తగ్గింది.
ఈ ప్రాజెక్టు కోసం పర్యావరణ ప్రభావంపై ఒక అంచనా నివేదికను విడుదల చేయాలని వైమానిక దళం భావించింది. అయితే, పర్యావరణ సమూహాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఈ ప్రక్రియ కూడా ఆలస్యమైంది. చివరికి, పక్షుల సంరక్షణకే ప్రాధాన్యతనిస్తూ ఈ కీలక ప్రాజెక్టును నిలిపివేయాలని నిర్ణయించినట్లు ప్రముఖ అమెరికన్ సైనిక పత్రిక స్టార్స్ అండ్ స్ట్రైప్స్ తన నివేదికలో వెల్లడించింది.