ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని విమర్శ..
అసెంబ్లీలో మైక్ ఇస్తే అక్కడే మాట్లాడతామన్న కేటీఆర్..
రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చెప్పినట్టుగానే చర్చ కోసం మంగళవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి ఆయన ప్రెస్ క్లబ్‌కు బయల్దేరడంతో హైదరాబాద్ రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన సాగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను వంచిస్తోందని అన్నారు. రైతు రుణమాఫీ, బోనస్ వంటి కీలక అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎంను ఎన్నోసార్లు ఆహ్వానించామని గుర్తుచేశారు. “అసెంబ్లీలో చర్చిద్దామంటే మాకు మైకు ఇవ్వరు. కనీసం ప్రెస్ క్లబ్‌లోనైనా చర్చకు రావాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారని తనకు తెలిసిందని, ఆయన హాజరుకాలేకపోతే మంత్రులనైనా చర్చకు పంపాలని కేటీఆర్ సూచించారు. సీఎంకు వీలైన మరో తేదీ, ప్రదేశం చెప్పినా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తమ మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం ఇస్తే అక్కడే చర్చించడానికి కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.