తెలంగాణ అభివృద్ధి అంశంపై చర్చ..
సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలన్న రేవంత్..
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌తో రేవంత్ రెడ్డి భేటీ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో గల తన నివాసంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్. మహేంద్ర దేవ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే అంశంపై ఈ సందర్భంగా వారు చర్చలు జరిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు వెళుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. అనుసంధానంగా రేడియల్ రోడ్లను కూడా నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని, తిరిగి చెల్లించడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలు చెల్లించడానికే అధిక ఆదాయం ఖర్చు చేయవలసి వస్తోందని అన్నారు. అధిక వడ్డీ రేట్లకు తీసుకున్న రుణాలపై వడ్డీ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.