*ప్రతి కుటుంబానికి 5 మొక్కలు ఉచితం.. నెక్లెస్ రోడ్‌లో ఏర్పాట్లు పూర్తి
*హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వనమహోత్సవం-2026’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) సంచలన నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంతో నగర ప్రజలకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయనుంది. అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ’ (CURE) పథకం కింద ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
*కార్యక్రమ వివరాలు:
*తేదీ: ఆగస్టు 1, 2026 (శనివారం)
*సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు
*వేదిక: నర్సరీ మేళా ప్రాంగణం, నెక్లెస్ రోడ్, హైదరాబాద్
*ఇంటింటా పచ్చదనం.. కుటుంబానికి 5 మొక్కలు
పట్టణ ప్రజలు తమ ఇళ్లలో కిచెన్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ వేదికపై హాజరయ్యే ప్రతీ కుటుంబానికి *ఐదు ఉచిత మొక్కలను అందజేయనున్నారు.
ఇందులో ప్రధానంగా మూడు రకాల మొక్కలను ఎంపిక చేశారు:
*పండ్ల మొక్కలు: కుటుంబానికి అవసరమైన పోషకాహారాన్ని అందించేవి.
*ఔషధ మొక్కలు:ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే ఆయుర్వేద మొక్కలు.
*అలంకరణ మొక్కలు: ఇళ్లలో అందాన్ని తెచ్చే ఇండోర్, అవుట్‌డోర్ మొక్కలు.
*సిటీ టెర్రస్ గార్డెనర్స్ భాగస్వామ్యంతో..
ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం.. సిటీ టెర్రస్ గార్డెనర్స్ (CTG) సంస్థతో కలిసి పనిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావ నియంత్రణ, భూగర్భ జలాల పెంపు, జీవ వైవిధ్య సంరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలా ఈ వేదిక వేదికగా చైతన్యం తీసుకెళ్లనున్నారు.
*పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు
పౌరులు, పర్యావరణ ప్రేమికులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA లు), విద్యార్థులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని హెచ్‌ఎండీఏ విజ్ఞప్తి చేసింది. మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం ద్వారా ఆరోగ్యకరమైన, హరితవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరింది.


