- *శ్రీనివాస కాలనీలో రూ. 81 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
- *సీసీ కెమెరాలను ప్రారంభించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్
*ఎల్బీనగర్ :
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఎల్బీనగర్ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయింపు జరుగుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఎల్బీనగర్కు కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్నారని స్పష్టం చేశారు.
సాహెబ్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో రూ. 81 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంతో పాటు, కాలనీలో ప్రజల భద్రత కోసం రూ. 9 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మాజీ కార్పొరేటర్లు ముద్దులచ్చిరెడ్డి, లక్ష్మీ ప్రసన్న గౌడ్ తదితరులతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
*మౌలిక వసతుల కల్పనే ధ్యేయం:
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. సాహెబ్ నగర్ డివిజన్లోని ప్రతి శివారు కాలనీకి అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే జోనల్ కమిషనర్‌తో ప్రత్యేకంగా సమావేశమై రోడ్లు సహా ఇతర అభివృద్ధి పనులపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించామని, త్వరలోనే శివారు కాలనీలలో నూతన రోడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామని హామీనిచ్చారు.
గత పాలకులు ప్రజాధనాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దారి మళ్లించారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సొమ్మును ప్రజల సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తోందని తేల్చిచెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత కేవలం అభివృద్ధి ఒక్కటే తమ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. తన విద్యార్థి దశలో సాహెబ్ నగర్ ప్రాంతంలో తిరిగిన రోజులను, ఇక్కడ తనకు ఉన్న ఆత్మీయ మిత్రులను ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకం చేసుకున్నారు.
*పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మకుటం సదాశివుడు, డివిజన్ అధ్యక్షులు కేతావత్ రమేష్ నాయక్, పర్వతి గణేష్ రెడ్డి, శ్రీనాథ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు కొండోజు శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీలు స్వర్ణ మాధవి, కుట్ల నర్సింహా యాదవ్, విద్యా రెడ్డి, సూర్యనారాయణ, బోడ రాజశేఖర్, రేణు గౌడ్, శశికాంత్, నందకిషోర్, పారంద స్వామి, శ్రీనివాస కాలనీ అధ్యక్షులు చిత్తరంజన్, అలాగే వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


