Thursday, August 6, 2026
Google search engine
Homeతెలంగాణవిద్యార్థుల జీవితాలతో చెలగాటం..

విద్యార్థుల జీవితాలతో చెలగాటం..

  • నకిలీ ఎన్‌వోసీల దందాపై హైడ్రా ఉక్కుపాదం!
  • అనుమతుల కోసం అక్రమ దారులు..

నకిలీ ఎన్‌వోసీలపై హైడ్రా ఉక్కుపాదం
ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తూ, నకిలీ ఫైర్ ఎన్‌వోసీలతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. హైడ్రా దర్యాప్తులో కొన్ని కాలేజీలు వెలుగు చూశాయి, ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా వందల కాలేజీలు స్కూళ్ల నిర్వహించబడుతున్నాయి, ప్రభుత్వ ముద్రలను ఫోర్జరీ చేస్తూ సాగుతున్న ఈ విద్యా వ్యాపార దందాపై సీ.ఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించాలి. భద్రతకు తూట్లు పొడుస్తున్న ఈ కేటుగాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఫోర్జరీ యాజమాన్యాల భరతం పట్టాలని విద్యావర్గాలు కోరుతున్నాయి.

హైదరాబాద్:

విద్యా వ్యవస్థలో భద్రతకు తూట్లు పొడుస్తున్న కేటుగాళ్లు
రాష్ట్ర రాజధానిలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల ముసుగు తొలగిపోతోంది. అకడమిక్ అఫిలియేషన్లు, నిర్వహణ అనుమతుల కోసం కక్కుర్తి పడిన యాజమాన్యాలు ఏకంగా ప్రభుత్వ శాఖల ముద్రలను ఫోర్జరీ చేస్తూ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చేపట్టిన దర్యాప్తులో వెలుగుచూసిన ఈ దారుణ నిజాలు విద్యావర్గాల్లో కలకలం రేపుతున్నాయి. భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసి, నకిలీ ఫైర్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లతో సాగిస్తున్న ఈ చీకటి వ్యాపారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

*మూలాల నుంచి కదిలిన యంత్రాంగం.. వెలుగులోకి నకిలీల పరంపర:
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ విద్యాధికారులను మోసగించేందుకు పన్నిన పన్నాగం బట్టబయలైంది. ఫిబ్రవరి 26, 2026న హైందవి జూనియర్ కళాశాలపై వచ్చిన ఫిర్యాదుతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది.
దీనిని సీరియస్‌గా తీసుకున్న హైడ్రా.. 2025–26, 2026–27 విద్యా సంవత్సరాలకు గాను వివిధ జిల్లాల నుంచి సమర్పించిన ఫైర్ ఎన్‌వోసీల ప్రామాణికతపై లోతైన దర్యాప్తు చేపట్టింది. రెండు విడతలుగా అధికారులు జరిపిన పరిశీలనలో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. మొదటి దశలో పరిశీలించిన 76 ధ్రువీకరణ పత్రాల్లో 7 నకిలీవిగా తేలగా, రెండో దశలో ఏకంగా 45 పత్రాలు ఫోర్జరీ చేసినట్లు స్పష్టమైంది. మొత్తం మీద ఈ పరిధిలో సమర్పించిన 142 ఎన్‌వోసీలలో సగానికి పైగా (52 పత్రాలు) నకిలీవే కావడం వ్యవస్థలోని లొసుగులను ఎత్తిచూపుతోంది.

*ఎఫ్‌.ఐ.ఆర్‌.లో నమోదైన కీచక కళాశాలలు..
నకిలీ పత్రాలతో అధికారులను మోసం చేసినట్లు నిర్ధారణ కావడంతో, జూలై 04న లేక్ పోలీస్ స్టేషన్‌లో హైడ్రా ఫిర్యాదు మేరకు కేసు (ఎఫ్‌.ఐ.ఆర్‌. నెం. 92/2026) నమోదైంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 337, 336(3), 340(2), 318(4), r/w 3(5) కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

*ఈ కుట్రలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన ప్రధాన కళాశాలల వివరాలు ఇవి:

  • హైందవి జూనియర్ కళాశాల: బర్కత్‌పుర, హైదరాబాద్. (నకిలీ ఎన్‌వోసీ తేది: 28-08-2025)
  • రెసోనెన్స్ జూనియర్ కళాశాల (కోడ్: 60282): ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్. (నకిలీ ఎన్‌వోసీ తేది: 27-02-2026)
  • ప్రియాంక గర్ల్స్ జూనియర్ కళాశాల (కోడ్: 60319): మెహిదీపట్నం, హైదరాబాద్. (నకిలీ ఎన్‌వోసీ తేది: 24-03-2026)
  • మదర్స్ గర్ల్స్ జూనియర్ కళాశాల (కోడ్: 61328): విద్యానగర్, హైదరాబాద్. (నకిలీ ఎన్‌వోసీ తేది: 27-02-2026)
  • శ్రీ చంద్ర జూనియర్ కళాశాల (కోడ్: 61345): చంద్రాయణగుట్ట, హైదరాబాద్. (నకిలీ ఎన్‌వోసీ తేది: 17-02-2026)
  • న్యూ ఎరా జూనియర్ కళాశాల (కోడ్: 61238): చిక్కడపల్లి, హైదరాబాద్. (నకిలీ ఎన్‌వోసీ తేది: 27-02-2026)
  • షాహీన్ జూనియర్ కళాశాల (కోడ్: 58513): శివరాంపల్లి, హైదరాబాద్. (నకిలీ ఎన్‌వోసీ తేది: 31-03-2026)
  • వసిష్ట జూనియర్ కళాశాల (కోడ్: 49229): తెల్లాపూర్, సంగారెడ్డి జిల్లా. (నకిలీ ఎన్‌వోసీ తేది: 26-05-2025)

*భద్రతను గాలికి వదిలేస్తే కఠిన చర్యలు:
ప్రభుత్వ హెచ్చరిక
విద్యార్థుల ప్రాణ రక్షణే ధ్యేయంగా అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉండగా, కొందరు అక్రమార్కులు రికార్డులను తారుమారు చేస్తూ అడ్డదారి తొక్కుతున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో విద్యా వ్యాపారం సాగిస్తున్న ఈ కేటుగాళ్ల భరతం పట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
ఫోర్జరీకి పాల్పడిన యాజమాన్యాలపై చట్టపరంగా కఠిన శిక్షలు ఉండేలా, తదుపరి కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా స్పష్టమైన సిఫార్సులు చేసింది. త్వరలోనే మరిన్ని ఆధారాలతో ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల బాగోతం వెలుగులోకి రానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments