Saturday, August 8, 2026
Google search engine
Homeతెలంగాణసైబర్ నేరాల కట్టడిలో దేశానికే రోల్‌ మోడల్‌గా తెలంగాణ!

సైబర్ నేరాల కట్టడిలో దేశానికే రోల్‌ మోడల్‌గా తెలంగాణ!

జాతీయ ప్రగతి సమీక్షలో అగ్రస్థానం.. డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక అభినందన

హైద్రాబాద్

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు మరోసారి తమ సత్తా చాటారు. దేశంలోనే నంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన జాతీయ ప్రగతి సమీక్షలో తొమ్మిది కీలక మూల్యాంకన ప్రమాణాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ అఖండ విజయంతో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు తెలంగాణ పోలీసు శాఖ దిక్సూచిగా మారింది.

ఘనత సాధించిన తీరు:
నేరాల కట్టడి, బాధితులకు సత్వర న్యాయం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజల్లో చైతన్యం వంటి అన్ని విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కింద ప్రత్యేకంగా ‘తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది.

  • ఐదు లక్షలకు పైగా విలువైన మోసాల కేసుల్లో నూట నలభై తొమ్మిది ఈ-జీరో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి సంచలనం సృష్టించింది.
  • ఫిర్యాదుల పరిష్కారంలో ఎనుబది ఎనిమిది శాతం, బాధితుల సొమ్ము రికవరీలో ఎనుబది ఒక శాతం ప్రగతిని సాధించింది.
  • సహయోగ్ పోర్టల్ ద్వారా అభ్యంతరకర ఆన్‌లైన్ కంటెంట్ తొలగింపులో ఎనుబది ఎనిమిది శాతం విజయం సాధించింది.
  • అంతర్రాష్ట్ర సమన్వయంలో భాగంగా తొంబై ఏడు శాతం సీఐఏఆర్ అభ్యర్థనలను, డెబ్బై తొమ్మిది శాతం ఇతర రాష్ట్రాల అభ్యర్థనలను విజయవంతంగా పరిష్కరించింది.
  • ఏకంగా ఐదు వేల ఐదు వందల మంది నేరస్థుల ప్రొఫైళ్లను అప్‌లోడ్ చేయడంతో పాటు పదిహేను వేల అంతర్రాష్ట్ర నేర లింకులను ఛేదించింది.

*సామర్థ్య పెంపు – విస్తృత అవగాహన
పోలీసు సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించడానికి సైట్రెయిన్ పోర్టల్ ద్వారా ఐదు వందల ఇరవై నాలుగు మంది అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించారు. దేశవ్యాప్తంగా కేంద్రం గుర్తించిన పదిహేను తీవ్రమైన సైబర్ హాట్‌స్పాట్ జాబితాలో తెలంగాణ లేకపోవడమే ఇక్కడ నేరాల నియంత్రణ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది.
మరోవైపు, ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా నేరుగా చేరుకున్నారు. ముఖ్యంగా, ప్రస్తుత కాలంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై మరో రెండు లక్షల మందికి పైగా ప్రత్యేకంగా అవగాహన కల్పించి అప్రమత్తం చేశారు.

*అధికారుల అభినందనలు:
ఈ చారిత్రాత్మక విజయంపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, జిల్లాల కమిషనర్లు, ఎస్పీలు, బ్యూరో అధికారులతో పాటు సిబ్బంది అందరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఇది పోలీసు శాఖ సమిష్టి కృషికీ, నిబద్ధతకూ దక్కిన నిదర్శనమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే జోరును కొనసాగిస్తూ, అత్యాధునిక సాంకేతికతను జోడించి తెలంగాణ పోలీసు కీర్తి ప్రతిష్టలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments