తెలంగాణ ఉద్యమ ప్రాతఃస్మరణీయ నేతకు ఘన నివాళి
బడంగ్పేట్:
బడంగ్పేట్ సర్కిల్-16 జీహెచ్ఎంసీ కార్యాలయంలో తెలంగాణ తొలి ఉద్యమ నాయకుడు, పద్మశాలి ఉద్యమ దిగ్గజం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆదివారం అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ వి.సమ్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొని, కార్యాలయ అధికారులు మరియు సిబ్బందితో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
*తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బాపూజీ: డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వి.సమ్మయ్య మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత హక్కులు, ప్రజల ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన విశేష కృషిని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగంచేసి, ఆనాడు ఆయన పోషించిన చారిత్రక పాత్ర అసాధారణమని పేర్కొన్నారు. బాపూజీ చూపిన ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి ఎప్పటికీ ఆదర్శప్రాయమని, ఆయన అందించిన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మరియు పలువురు స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


