కందుకూరు:
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియపై బుధవారం కందుకూరు ఆర్డీఓ కార్యాలయం, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ),మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం మరియు ఏఈఆర్ఓ పాల్గొని, పట్టభద్రుల ఓటర్లుగా నమోదు కావడానికి అవసరమైన అర్హతలు, దరఖాస్తు విధానం సమర్పించాల్సిన పత్రాల గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం, 01.11.2026 నాటికి పట్టభద్రుడిగా ఉండి, కనీసం మూడు సంవత్సరాల క్రితం అంటే 31.10.2023 నాటికి డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హతను పొందిన వారు పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుతో పాటు సంబంధిత డిగ్రీ/విద్యార్హతకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సమర్పించాలని వివరించారు.దరఖాస్తులను సంబంధిత ERO/AERO వద్ద సమర్పించవచ్చని తెలియజేశారు.గత ఎన్నికల కోసం రూపొందించిన పట్టభద్రుల ఓటర్ల జాబితాలో పేరు ఉన్నప్పటికీ, ఆ జాబితా ప్రస్తుత ఎన్నికలకు చెల్లుబాటు కాదని సమావేశంలో స్పష్టం చేశారు. ప్రస్తుత ఎన్నికల ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవాలంటే అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తాజాగా ఫారం -18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గత ఎన్నికల్లో ఓటు వేసిన విషయం లేదా గత ఓటర్ల జాబితాలో పేరు ఉండటం ఆధారంగా ప్రస్తుత ఎన్నికల ఓటర్ల జాబితాలో పేరు కొనసాగదు.అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా నిర్ణీత గడువులో ఫారం -18 సమర్పించి తన పేరును ప్రస్తుత పట్టభద్రుల ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. అర్హులైన పట్టభద్రులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించి సహకరించాలని కోరారు.


