- యునైటెడ్ కింగ్డమ్ సంస్థలతో రెండు కీలక ఒప్పందాలు
- తుమ్మల చొరవతో సాంకేతిక వస్త్ర తయారీకి నూతన ఉత్తేజం.
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో చేనేత, జౌళి రంగాన్ని ఆధునిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ, సాంకేతిక వస్త్రాల రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ప్రముఖ విద్యా, పారిశ్రామిక సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఒప్పందాల వివరాలను వెల్లడించారు.
సాంకేతిక వస్త్రాలు (టెక్నికల్ టెక్స్టైల్స్) అంటే కేవలం దుస్తులకు మాత్రమే పరిమితం కాకుండా వైద్య, వాహన, నిర్మాణ, రక్షణ రంగాలలో ఉపయోగించే ప్రత్యేక వస్త్రాలు. ఈ రంగానికి శాస్త్రీయంగానూ, పారిశ్రామికంగానూ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. రాష్ట్రంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడం, పరిశ్రమలకు నాణ్యమైన శిక్షణ అందించడం మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

హడర్స్ఫీల్డ్ విశ్వవిద్యాలయంతో పరిశోధన, అభివృద్ధి:
యునైటెడ్ కింగ్డమ్లోని హడర్స్ఫీల్డ్ విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ మధ్య మొదటి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా సాంకేతిక వస్త్ర రంగంలో శాస్త్రీయ పరిశోధనలకు పటిష్టమైన పునాది పడనుంది.
- ఉమ్మడి విద్యా కార్యక్రమాలు: విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థుల పరస్పర మార్పిడి మరియు సందర్శక పండితుల నియామకం ద్వారా జ్ఞాన మార్పిడి జరుగుతుంది.
- పరిశోధనా వ్యవస్థ: అధునాతన వస్త్ర పరిజ్ఞానంపై ప్రయోగాలు చేయడం ద్వారా పరిశ్రమకు అవసరమైన సమగ్ర పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.
టెక్స్టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో నైపుణ్యాభివృద్ధి:
యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ‘టెక్స్టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’తో పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని చేనేత, జౌళి, హస్తకళల విభాగం రెండో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
- త్రిమితీయ నేత, సంకర పదార్థాలు: త్రిమితీయ నేత (3D వీవింగ్), సంకర పదార్థాలు (కాంపోజిట్ మెటీరియల్స్) వంటి అత్యంత సంక్లిష్టమైన తయారీ విధానాలపై ఈ ఒప్పందం దృష్టి సారిస్తుంది.
- అంతర్జాతీయ ప్రమాణాలు: పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వృత్తి విద్య, శిక్షణ అందించడం ద్వారా అంతర్జాతీయ పోటీతత్వం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడం జరుగుతుంది.
*ప్రపంచస్థాయి నైపుణ్యంతో నూతన అవకాశాలు:
ఈ భాగస్వామ్యాల ద్వారా పారిశ్రామిక సంస్థలు, శిక్షణ కేంద్రాల మధ్య సమన్వయం పెరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణలో సాంకేతిక వస్త్ర రంగానికి ఉన్న విస్తృత అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని, రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, యార్క్షైర్ బిజినెస్ అడ్వైజర్ మ్యాండీ రిడ్యార్డ్, యాంటిచ్ అండ్ సన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ యాంటిచ్, సాంకేతిక వస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ గోస్వామి, టెక్స్టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అజీజ్ మరియు జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు.



