- వ్రాత పూర్వక ఫిర్యాదులు చేసినా పట్టించుకోని బడంగ్ పేట్ సర్కిల్ 16 యంత్రాంగం.
- మున్సిపల్ అనుమతులు లేకుండానే కర్నూల్ హైవే అనుకుని భారీ అక్రమ నిర్మాణం
- బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, జోనల్ కమిషనర్ చంద్రకళ, ఎస్టిఎఫ్ బాస్ మెహర, దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్..
బడంగ్ పేట్
జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్ 16 పరిధిలోని మందమల్లమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో కర్నూలు రహదారిని ఆనుకుని మున్సిపల్ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ అనుమతులు లేకుండానే వెలసిన ఒక భారీ అక్రమ నిర్మాణం స్థానిక టౌన్ ప్లానింగ్ యంత్రాంగం వైఫల్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలను త్రోసిరాజంటూ సాగుతున్న ఈ నిర్మాణంపై రెండు నెలల క్రితమే స్థానిక ప్రజలు సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. అయినప్పటికీ బడంగ్ పేట్ సర్కిల్ 16 డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అటువైపు కంటిచూపైనా చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు దాగి ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నోటీసులకే పరిమితం.. నిర్మాణం పూర్తి వరకు ప్రోత్సాహం!
ప్రజల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు అందగానే క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేసి, నిర్మాణాన్ని నిలిపివేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ, అధికారులు కేవలం నామమాత్రపు చర్యలతో సరిపెట్టి, నిర్మాణం పూర్తయ్యే వరకు కాలయాపన చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చూపిన అలసత్వంతో సదరు అక్రమ నిర్మాణం పనులు పూర్తయి, ప్రస్తుతం ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమవడం శోచనీయం. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన యంత్రాంగమే అక్రమ నిర్మాణాలకు రక్షణ కవచంగా నిలవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముడుపుల మత్తులో కింది స్థాయి సిబ్బంది?
ఈ అక్రమ నిర్మాణం వెనుక కింది స్థాయి టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రమేయంపై లోతైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో ఫిర్యాదులు వచ్చినప్పటికీ పనులు వేగంగా సాగడం చూస్తుంటే, అధికారులు ముడుపులు పుచ్చుకుని దగ్గరుండి నిర్మాణాన్ని ప్రోత్సహించారనే వార్తలు స్థానికంగా బలంగా వినపడుతున్నాయి. ప్రభుత్వ భూములు, ప్రధాన రహదారుల వెంట ఉండే స్థలాలను రక్షించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, స్వప్రయోజనాల కోసం చట్ట వ్యతిరేక చర్యలకు బాటలు వేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బాధ్యులపై శాఖాపరమైన చర్యలకు స్థానికుల డిమాండ్:
ప్రజా ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తూ, అక్రమ నిర్మాణ దారులతో కుమ్మక్కై బడంగ్ పేట్ ప్రాంతంలో నిబంధనల ఉల్లంఘనకు సహకరించిన టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ (టీపీఎస్) సాయి కిరణ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) కళ్యాణ్ చక్రవర్తిలపై తక్షణమే శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనంతో జీతాలు పొందుతూ అక్రమాలకు తావిస్తున్న అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని, ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేసి చట్టాన్ని కాపాడాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.




