- 2029 నాటికి మాదకద్రవ్యాల రహిత భారత్ లక్ష్య సాధనకు సమిష్టి కృషి అవసరం
- నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఘనంగా దత్తన్న అలయ్ బలయ్ వేడుకలు
హైదరాబాద్
రాజకీయ విభేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సామాజిక సామరస్యాన్ని, స్నేహభావాన్ని బలోపేతం చేయడంలో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం విశేష పాత్ర పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. తెలంగాణ సమృద్ధమైన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వానికి ఈ వేదిక ప్రతీకగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో, ఆయన కుమార్తె విజయలక్ష్మి సమర్పణలో “నషా ముక్త్ భారత్… వికసిత్ భారత్” నినాదంతో ‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి శ్రీమతి జానకి శుక్లాతో కలిసి విచ్చేసారు. ఈ సందర్భంగా పూర్వ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గవర్నర్ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం సభికులందరితో కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞను గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఆచరించారు.

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక:
అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సామాజిక కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు ఒకే వేదికపై కలవడం భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలో 2005లో శ్రీ బండారు దత్తాత్రేయ ప్రారంభించిన ఈ సంప్రదాయం రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజలను కలిపే సామాజిక వేదికగా ఎదిగిందని కొనియాడారు. ఈ వేడుకను నిరంతరం కొనసాగిస్తున్న బండారు విజయలక్ష్మిని అభినందించారు.
ప్రజాస్వామ్యంలో విధానాలు, ఆలోచనల పరంగా భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే అవి పరస్పర గౌరవం, స్నేహభావం, సహకారానికి అడ్డంకిగా మారకూడదని గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. భిన్నత్వాన్ని గౌరవించడం భారతదేశ ఐక్యతకు పునాది అని, రాష్ట్ర ప్రగతి కేవలం ఆర్థిక, సాంకేతిక అభివృద్ధితోనే కాకుండా పౌరుల మధ్య పరస్పర విశ్వాసం, సామరస్యంపై కూడా ఆధారపడి ఉంటుందని అన్నారు.
యువత సాంస్కృతిక మూలాలను గౌరవించాలి:
యువత తమ సాంస్కృతిక మూలాల పట్ల గర్వంగా ఉండాలని, ఇతరుల సంప్రదాయాలను గౌరవించాలని గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. తమ ప్రతిభను సమాజ సేవకు, దేశాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత విజయాలు సమాజానికి, దేశానికి ఉపయోగపడినప్పుడే వాటికి నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు సమిష్టి పోరాటం:
మాదకద్రవ్యాల సమస్య దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వ యంత్రాంగం, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు, ప్రజలందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టాలని సూచించిన విషయాన్ని గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గుర్తుచేశారు. తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని లాల్ బహాదుర్ స్టేడియంలో సుమారు పదిహేను వేల మంది విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యుల సమక్షంలో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించినట్లు వివరించారు. ఈ నెల 28న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ప్రత్యేక మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
సంప్రదాయ మాదకద్రవ్యాలతో పోలిస్తే సింథటిక్ మత్తు పదార్థాలు మరింత ప్రమాదకరమైనవని గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా హెచ్చరించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ఈ ముప్పును అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. 2029 నాటికి దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చాలన్న ప్రధానమంత్రి లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
జాతీయ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం:
సామాజిక సామరస్యం, సాంస్కృతిక ఐక్యత, జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉందని గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. దేశం పట్ల అంకితభావంతో వ్యవహరిస్తూ జాతీయ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను గవర్నర్ ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్ శ్రీ గులాబ్ చాంద్ కటారియా, పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, పూర్వ గవర్నర్ శ్రీ విద్యా సాగర్ రావు, కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



