శేరిలింగంపల్లి :
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం లక్ష్యంగా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, మాదాపూర్ సైక్లింగ్ రివల్యూషన్ సంయుక్తంగా ‘పింక్ సైక్లోథాన్ – లెట్స్ పెడల్ అగైనెస్ట్ క్యాన్సర్’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించాయి. పింక్ అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైక్లింగ్ ప్రియులు పాల్గొని రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన సందేశాన్ని చాటిచెప్పారు.
నార్సింగిలోని స్మార్ట్‌బైక్ నుంచి అవతార్ జంక్షన్ వరకు నిర్వహించిన ఈ నైట్ రైడ్ ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడంతో పాటు, క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఆంకాలజిస్టులు డాక్టర్ రవి చందర్ వెలిగేటి, డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి, డా. శ్రీవాస్తవ, డా. గీత నాగశ్రీ పాల్గొని వారు మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం, సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని అవగాహన కల్పించారు.
మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వైద్యుల సూచనల మేరకు తగిన పరీక్షలు చేయించుకోవాలని, అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశాన్ని అందించారు.
ఈ సైక్లింగ్‌ను ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ప్రోత్సహించడంతో పాటు, క్యాన్సర్‌పై సమాజంలో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
‘క్యాన్సర్‌పై పోరాటంలో అవగాహనే తొలి అడుగు’ అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం రొమ్ము క్యాన్సర్‌పై చైతన్యం పెంపొందిస్తూ, మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది.
ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్స్ శ్రీకాంత్, సంపత్ పాల్గొన్నారు



