- బస్సుల కోసం తిప్పలు పడుతున్న ప్రయాణికులు
- ప్రయాణికులను పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
ఎల్బీనగర్
కొన్ని వందల మంది విద్యార్థులు, విద్యార్థినిలు మహిళలు, వ్యాపారస్తులు సిటీ బస్సులు ఎక్కే ప్రాంతాన్ని, అక్కడ ఉన్న మూడు బస్ షెల్టర్లను ఒక జ్యూవెలరీ షాప్ కోసం 30 ఏళ్ల నుండి నగర ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సు స్టాప్‌ను జిహెచ్ఎంసి సరూర్‌నగర్ సర్కిల్ అధికారులు రాత్రికి రాత్రే తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేలా అధికారులు హుటాహుటిన నిర్ణయం తీసుకుని, ఆర్టీసీ అధికారులకు బస్ స్టాప్ వెనుక ఉన్న వైన్ షాప్ వల్ల ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుందని ఒక మాట చెప్పి, బస్సు స్టాప్‌ను తరలించారని స్థానికులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో ఉన్న చైతన్యపురి బస్సు స్టాప్ షెడ్లను సర్కిల్ అధికారులు రాత్రికి రాత్రే జేసీబీలు పెట్టీ మూడు బస్ షెడ్లను తొలగించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ఈ బస్సు స్టాప్ వెనుక భాగంలో ఆదివారం కొత్తగా జ్యూవెలరీ షాప్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ వ్యాపార కేంద్రానికి బస్సు స్టాప్ అడ్డంకిగా మారిందన్న కారణంతోనే దానిని తొలగించి సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా, ఇక్కడ తెల్లవారుజాము నుండి మధ్య రాత్రి వరకు పండ్ల వ్యాపారులు సరుకులు రోడ్లపై పెట్టి వ్యాపారాలు నడిపిస్తుంటారు. పండ్ల బస్తాలను కూడా కొత్తగా ఏర్పాటు చేసిన బస్టాప్ లోనే దిగుమతి చేశారు. ఇలాంటి వాతావరణంలో
జిహెచ్ఎంసి సర్కిల్ అధికారులు రాత్రికి రాత్రే బస్సు స్టాప్‌ను ఏర్పాటు చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు, ప్రయాణికులు అంటున్నారు.బస్సు స్టాప్ తరలింపు వెనుక వ్యాపారవేత్తకు, సర్కిల్ అధికారులకు మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగి ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు, సుమారు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులకు అనువుగా ఉన్న ప్రాంతం నుంచి బస్సు స్టాప్‌ను అకస్మాత్తుగా తొలగించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేవలం జ్యూవెలరీ షాప్ యజమానికి లాభం చేకూర్చేందుకే బస్సు స్టాప్‌ను తరలించారని, దీంతో బస్ స్టాప్ ఎక్కడో తెలియక, బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియక, ఆర్టీసీ అధికారులు లేక, ప్రయాణికులకు తొలగించిన బస్ స్టాప్ లోనే బస్సు కోసం ఎదురుచూస్తూ, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



