Saturday, November 14, 2026
Google search engine
Homeహెల్త్ముందస్తు గుర్తింపుతో మధుమేహానికి అడ్డుకట్ట

ముందస్తు గుర్తింపుతో మధుమేహానికి అడ్డుకట్ట

  • మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పెరుగుతున్న మధుమేహ ముప్పు
  • లక్షణాలు కనిపించకపోయినా వ్యాధి ఉండే అవకాశం
  • నిర్లక్ష్యం చేస్తే గుండె, మూత్రపిండాలు, కళ్లపై తీవ్ర ప్రభావం
  • క్రమం తప్పకుండా పరీక్షలు, వ్యాయామం, సమతుల ఆహారంతో నియంత్రణ సాధ్యం

డాక్టర్ కృష్ణారెడ్డి తాడురి
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్
కిమ్స్ హాస్పిల్స్, కొండాపూర్.
శేరిలింగంపల్లి:

ముందస్తు గుర్తింపుతోనే మధుమేహనానికి అరికట్టవచ్చని కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ఉరుకుల పరుగుల జీవితం.. గంటల తరబడి కూర్చుని పనిచేయడం.. శారీరక శ్రమ తగ్గిపోవడం.. ఆహారపు అలవాట్లలో మార్పులు.. వెరసి నగర జీవనశైలిలో మధుమేహం (డయాబెటిస్‌) ముప్పు పెరుగుతోంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు యువతను సైతం వేధిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో ఐటీ, కార్పొరేట్‌ ఉద్యోగాలు, పని ఒత్తిడి, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు మధుమేహానికి దారితీసే ప్రమాద కారకాలుగా మారుతున్నాయి. వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవడంతో చాలామంది తమకు మధుమేహం ఉన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, సరైన చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రతి సంవత్సరం నవంబర్‌ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది 2026-27 ప్రచార థీమ్ ‘ఎర్లీ యాక్షన్‌ ఆన్‌ డయాబెటిస్‌’ (మధుమేహంపై ముందస్తు చర్యలు). వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడం, సకాలంలో వైద్య సేవలు పొందడం ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశం.

మధుమేహం వచ్చినప్పుడు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన, ఆకలి ఎక్కువగా వేయడం, కారణం లేకుండా బరువు తగ్గడం, అలసట, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే టైప్‌-2 మధుమేహం చాలాసార్లు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, శారీరక శ్రమ తక్కువగా చేసేవారు, రక్తపోటు సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర పరీక్షలు చేయించుకోవాలి.

నిర్లక్ష్యం చేస్తే అనర్థాలు
మధుమేహాన్ని సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, కంటి చూపు దెబ్బతినడం, నరాల సమస్యలు, పాదాలకు పుండ్లు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయులపైనా శ్రద్ధ వహించాలి. వైద్యుల సూచనల మేరకు కంటి పరీక్షలు, మూత్రపిండాల పనితీరు పరీక్షలు, పాదాల పరీక్షలు చేయించుకోవడం అవసరం.

జీవనశైలిలో మార్పులే కీలకం
మధుమేహం రాకుండా ఉండేందుకు, వచ్చిన తర్వాత అదుపులో ఉంచుకునేందుకు జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయాలి. పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, సంపూర్ణ ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చక్కెర పదార్థాలు, శీతల పానీయాలు, అధిక కొవ్వు పదార్థాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. తగినంత నిద్రపోవడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ముఖ్యం.
మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా మందులను నిలిపివేయకూడదు. రక్తంలో చక్కెర స్థాయులను క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ, వైద్యులు సూచించిన ఆహార నియమాలు, మందులు, వ్యాయామాన్ని తప్పనిసరిగా పాటించాలి. ముందస్తు గుర్తింపు, నిరంతర పర్యవేక్షణ, సరైన చికిత్సతో మధుమేహం ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన జీవితాన్ని తగిన జాగ్రత్తలు పాటిస్తూ కొనసాగించవచ్చు.

ధాన్యాల విషయంలో…
పండే పంటల్లో ముడి బియ్యం, దంపుడు బియ్యంతో పాటు ఇతర ధాన్యాలుగా వాడేటప్పుడు అవి పొట్టు తీయని ధాన్యాలై ఉండేలా జాగ్రత్త తీసుకోండి. పొట్టు తీయని ధాన్యాల్లో పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండటం వల్ల అవి రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడానికి కృషి చేస్తాయి.
ఇతర ధాన్యాల విషయంలో సజ్జలు, జొన్నలు, బార్లీ, రాగులు, కొర్రలు వంటి ధాన్యాల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ఇటీవల ఈ ధాన్యాలను వాడుతున్నారు. ఈ ధాన్యాలతోనూ ఇటీవల చాలా స్పెషల్ ఐటమ్స్ చేసుకుంటున్నారు.

కూరల విషయంలో…
పండుగ స్పెషల్స్‌లో పీచు ఎక్కువగా ఉండే బీర, బెండ, వంగ, టొమాటో, గుమ్మడి వంటి కాయగూరలు, తోటకూర, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుపచ్చని ఆకుకూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్)తోనే వీలైనంతగా స్పెషల్ వంటలు, మీగడ, వనస్పతి నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం సరికాదు. కాకపోతే పండుగ సందర్భంగా స్పెషల్ ఐటమ్స్‌లో వాటిని పరిమితంగానే ఉపయోగించండి.
ఇక నూనెలు ఉపయోగించాల్సినప్పుడు పాలీ అన్‌శాచ్యురేటెడ్ నూనెలైన (ప్యూఫా) పొద్దుతిరుగుడు, కుసుమ నూనెలను… అలాగే మోనో అన్‌శాచ్యురేటెడ్ నూనెలైన (మ్యూఫా) నువ్వుల నూనె, సోయా నూనె, ఆలివ్ ఆయిల్‌ను మార్చి మార్చి ఉపయోగించడం మంచిది.

పండ్లలో…
బొప్పాయి, జామ, నేరేడు, నారింజ, కమలా, పుచ్చ వంటి తక్కువ తీపి ఉండే పండ్లనే తినండి. ఇక ఈ సీజన్‌లో వచ్చే తీపి ఎక్కువగా ఉండే సీతాఫలానికి దూరంగా ఉండటం అవసరం. పండ్ల రసాలకు బదులుగా పండ్లే తినడం మంచిది.

స్వీట్స్ విషయంలో…
పాలు-పంచదారతో తయారు చేసే మిఠాయిలు, తీపి పదార్థాలు, తేనె, జామ్స్, జెల్లీలు, కేకులు, పేస్ట్రీలకు దూరంగా ఉండండి. ఒకవేళ పండుగ సందర్భంగా తినాల్సి వస్తే పరిమితంగా తినండి. ఆ క్యాలరీలను కరిగించడానికి తప్పక వాకింగ్ వంటి వ్యాయామం చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments