Monday, November 16, 2026
Google search engine
Homeతెలంగాణదీపావళి వేళ ఇంటికి తాళం వేసి వెళ్లిన కుటుంబం..

దీపావళి వేళ ఇంటికి తాళం వేసి వెళ్లిన కుటుంబం..

  • తాళం పగులగొట్టి రూ.50 లక్షల సొత్తుతో ఉడాయించిన దొంగలు..
  • ఆరు రోజుల్లోనే నలుగురు దొంగలు అరెస్ట్!
  • పోలీసుల చాకచక్యంతో చోరీ కేసు ఛేదింపు..
  • బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం

ఎల్బీనగర్:

దీపావళి పండుగ సమయంలో కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లడాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. అయితే వనస్థలిపురం పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి కేవలం ఆరు రోజుల్లోనే కేసును ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 8న దీపావళి పండుగ రోజున సచివాలయ నగర్‌లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో నిందితులు ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారు, వజ్రాభరణాలు, వెండి వస్తువులతో పాటు నగదును అపహరించి పరారయ్యారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారంతో నిందితులను గుర్తించి నవంబర్ 14న తెల్లవారుజామున 5గంటల సమయంలో ఆటోనగర్‌లోని మోహన్ కంటా వద్ద అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులను గురువల్లి చంద్రశేఖర్ (30), సిరిగిడి ప్రకాశ్ (40), ఎటబోయిన అరవింద్ (20), సంతోళ్ల బాలకృష్ణ (36)గా గుర్తించారు. నిందితుల నుంచి 21 తులాల బంగారు ఆభరణాలు, 15 గ్రాముల వజ్రాభరణాలు, 54 తులాల వెండి వస్తువులు, రూ.9 లక్షల నగదుతో పాటు ఐదు సెల్‌ఫోన్లు, పల్సర్ 150 బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం చోరీ సొత్తు విలువ సుమారు రూ.50 లక్షలుగా పోలీసులు వెల్లడించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి, ఎల్బీనగర్ డీసీపీ బి.అనురాధ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వనస్థలిపురం ఇన్‌చార్జి ఏసీపీ కరుణాకర్ రావు తెలిపారు. ఆరు రోజుల్లోనే చోరీ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులను పలువురు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments