జీతం ఏడాదికి 4 లక్షల డాలర్లు..
భారతీయ కరెన్సీ లో దాదాపు 3. 35 కోట్లు
విలాసవంతమైన భవనం, రవాణా సౌకర్యం..
అత్యంత భద్రతతో కూడిన వాహనాలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగరేశారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై భారీ విజయాన్ని సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. హోరాహోరీగా అనుకున్న పోరులో ఏకపక్ష విజయం సాధించి అందరి అంచనాలను తలకిందులు చేశారు. గెలుపోటములను నిర్ణయించే స్వింగ్ స్టేట్స్‌ను ట్రంప్ స్వీప్ చేశారు. డెమోక్రాట్లకు కంచుకోటల్లాంటి రాష్ర్టాల ‘బ్లూ వాల్’ను బద్దలు కొట్టారు. కేసులను ఎదుర్కొని, కాల్పులను తట్టుకొని ఆయన పోరాడి గెలిచారు. దీంతో నాలుగేండ్ల క్రితం హింసాత్మక ఘటనల మధ్య వైట్ హౌజ్‌ను వీడిన ట్రంప్ ఇప్పుడు ప్రజా మద్దతుతో సగర్వంగా అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడికి ఎంత జీతం వస్తుంది..? ఎలాంటి సౌకర్యాలు వారికి లభిస్తాయి..? వంటివి విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
అమెరికాను పాలించే అధిపతి జీతం ఏడాదికి 4 లక్షల డాలర్లుగా ఉంటుంది. అంటే మన భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.3.36 కోట్లు అన్నమాట. దీన్ని నెలవారీగా చెల్లిస్తారు. జీతంతో పాటు అధికారిక విధుల నిర్వహణకు అవసరమైన ఖర్చుల నిమిత్తం ఏడాదికి మరో 50,000 డాలర్లు.. అంటే దాదాపు రూ.42 లక్షలు అందుకుంటారు. ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన వారు తన అభిరుచికి అనుగుణంగా శ్వేతసౌధాన్ని మార్చుకునేందుకు వీలుగా ఒక్కసారి మాత్రమే లక్ష డాలర్లు.. అంటే రూ.84 లక్షలు కేటాయిస్తారు. అంతేకాకుండా ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు (రూ.84 లక్షలు), వినోదం కోసం రూ.19 వేల డాలర్లు (రూ.16 లక్షలు) కేటాయిస్తారు.

అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జీతం 2వేల డాలర్లు ఉండేది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ సంపదలో వృద్ధి, అధ్యక్షుల ఖర్చులు పెరిగిపోవడంతో జీతం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక చివరిసారిగా 2001లో అధ్యక్షుడి జీతం పెరిగింది. అప్పటి నుంచి అమెరికా ప్రెసిడెంట్ జీతం ఏడాదికి 4 లక్షల డార్లుగా కొనసాగుతోంది.
అధ్యక్షుడికి సకల సౌకర్యాలు అందుతాయి. వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుడు నివసించేందుకు అత్యంత విలాసవంతమైన అధికారిక భవనం శ్వేత సౌధం ఉంటుంది. ఇందులో అధ్యక్షుడి కుటుంబం మొత్తం నివసించొచ్చు. మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం విస్తరించి ఉంటుంది. ఇందులో వంట, ఇతర పనుల కోసం దాదాపు 100 మంది సహాయకులు ఉంటారు. ఇక అధ్యక్షుడికి భోజనాలు తయారు చేసేందుకు ప్రపంచంలోనే టాప్ షెఫ్‌లు ఉంటారు.
శ్వేతసౌధంతోపాటు బ్లెయిర్‌హౌస్ అనే అతిథి గృహం కూడా ఉంటుంది. ఇది శ్వేతసౌధం కంటే చాలా పెద్దది. ఇందులో ఏకంగా 119 గదులు, అతిథుల కోసం 20 బెడ్‌రూమ్‌లు, 35 బాత్‌రూమ్‌లు, 4 డైనింగ్ హాల్స్, జిమ్, సెలూన్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. క్యాంప్ డేవిడ్ అనే పర్వత విడిది కేంద్రం కూడా ఉంటుంది. దీన్ని ఎక్కువగా దౌత్యపరమైన చర్చల కోసం వినియోగిస్తుంటారు.

అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్నా.. అత్యంత భద్రతతో కూడిన వాహనాలనే వినియోగిస్తారు. అధ్యక్షుడికి అత్యంత విలాసవంతమైన. ప్రపంచంలోనే అత్యున్నత భద్రతతో కూడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ హెలికాప్టర్ కూడా ఉంటుంది. ఈ హెలికాప్టర్ భారీ పేలుళ్లను కూడా తట్టుకోగలదు. ఇలాంటివి అధ్యక్షుడికి ఐదు ఉంటాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత భద్రమైన ‘బీస్ట్’ కారులో అధ్యక్షుడు ప్రయాణిస్తుంటారు. ఇతర దేశాలకు వెళ్లినా సరే ఈ కారునే అధ్యక్షుడి వెంట తీసుకెళ్తుంటారు. అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఉచితంగా అందుతాయి.
ఇక అధ్యక్షుడిగా పదవీ విరమణ తర్వాత కూడా అనేక ప్రయోజనాలు పొందుతారు. మాజీ అధ్యక్షుడికి ఏడాదికి 2.30 లక్షల డాలర్ల పెన్షన్ అందుతుంది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. రూ.1.93 కోట్లన్నమాట. ప్రయాణ భత్యాలు, కోరుకున్న చోట నివాసం, సిబ్బంది వంటి సదుపాయాలు కూడా అందిస్తారు.